Madras High Court: ‘సిబిల్’ రిపోర్టు సరిలేదని ఊస్టింగ్!
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:26 AM
పేలవమైన క్రెడిట్ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది.

నియామకాన్ని రద్దు చేసిన ఎస్‌బీఐ
సమర్థించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): పేలవమైన క్రెడిట్ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా కీలకమని, బ్యాంకు తీసుకున్న నిర్ణయం సబబేనని స్పష్టం చేసింది. ఎస్‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) ఉద్యోగానికి పరీక్షలు, ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలతో సహా అన్ని దశలను దాటాక.. తన సిబిల్ రిపోర్ట్ సరిలేదన్న కారణంగా తన నియామకాన్ని సదరు బ్యాంకు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పై మేరకు అభిప్రాయపడింది. ఉద్యోగ నోటిఫికేషన్ సమయంలో తనకు ఎలాంటి పెండింగ్ బకాయిలు లేవని, తన నియామక రద్దు అన్యాయమని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, పిటిషనర్ సిబిల్ రిపోర్టులో పలు అవకతవకలున్నాయని, పదికి పైగా విచారణలు జరిగాయని, ఇది తీవ్ర ఆర్థిక దుర్వినియోగాన్ని సూచిస్తున్నట్లు ఎస్బీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. బ్యాంకు ఉద్యోగులు ప్రజాధనాన్ని నిర్వహిస్తారని, ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తిని ప్రజల డబ్బు నిర్వహణ వ్యవహారంలో విశ్వసించలేమని పేర్కొంది. పిటిషన్‌కు ఎలాంటి విచారణార్హత లేదని కొట్టివేసింది.