Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్
ABN , Publish Date - Apr 13 , 2025 | 10:43 AM
ప్రేమించిన వాడి కోసం కన్నవారిని కాదనుకుని వెళ్లిపోయింది ఓ యువతి. కానీ కన్నపేగు ఊరుకోక.. వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు తండ్రి. వ్యవహారం కోర్టుకు చేరింది. ఇక కుమార్తె చేసిన పనికి తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

భోపాల్: నేటి కాలంలో ప్రేమ వివాహాలు చాలా సర్వసాధారణం అయ్యాయి. మైనారిటీ తీరితే చాలు.. పోలోమని పెళ్లి చేసుకుంటున్నారు కొందరు యువతీయువకులు. చదువు లేదు.. జీవితంలో స్థిరపడలేదు.. తల్లిదండ్రుల ఇష్టంతో అసలే పని లేదు. ఇంటి నుంచి వెళ్లిపోవడం.. ఆర్యసమాజ్, గుడిలో వివాహం చేసుకోవడం అంతే. వారి నిర్ణయాలతో తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. కొద్ది కాలం నుంచి ప్రేమించిన వ్యక్తి కోసం.. కన్నవాళ్లను సులభంగా కాదనుకుంటున్నారు. ఇక పిల్లలు తీసుకునే నిర్ణయాల వల్ల కొందరు తల్లిదండ్రులు రాక్షసులుగా మారి.. బిడ్డలను చంపుతుంటే.. మరి కొందరు కన్నవాళ్లు పిల్లల మీద ప్రేమతో.. వారిని ఏం అనలేక.. అవమానాలు పడలేక.. తామే ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు రాసిన లేఖ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..
కుటుంబంలో చిచ్చు పెట్టిన ప్రేమ..
ఈ సంఘటన మధ్యప్రదేశ్, గ్వాలియార్‌లో చోటు చేసుకుంది. రిషిరాజ్ అలియాస్ సంజు జైశ్వాల్ అనే వ్యక్తి కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చక.. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజు జైశ్వాల్ స్థానికంగా ఒక మెడికల్ స్టోర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో సంజు కుమార్తె హర్షిత.. ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడిని ఇష్టపడింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో హర్షిత తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు. దాంతో 15 రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి వెల్లిపోయి.. ప్రేమంచిన వాడిని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుంది.
కుమార్తె గురించి విచారించగా ఆమె ఇండోర్‌లో ఉందని తెలిసి.. అక్కడకు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు సంజు. వ్యవహారం కాస్త కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానంలో విచారణ సందర్భంగా సంజు కుమార్తె.. తాను చట్టబద్దంగానే వివాహం చేసుకున్నానని.. తన భర్తతోనే కలిసి ఉంటానని స్పష్టం చేసింది. దాంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
కుమార్తె నిర్ణయంతో తీవ్ర మనస్థాపం..
ఈ నిర్ణయం పట్ల తీవ్ర మనస్థాపం చెందిన సంజు.. ఇంటికి వచ్చాక సూసైడ్ నోట్ రాసి.. దాన్ని కుమార్తె ఆధార్ కార్డుకు జత చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక.. అర్థరాత్రి తర్వాత తన గదిలోకి వెళ్లి గన్‌తో కాల్చుకుని చనిపోయాడు. ఇక సంజు తన ఆవేదననంతా లేఖలో వ్యక్తం చేశాడు. "హర్షితా.. నువ్వు చేసింది సరైంది కాదు. నాకు మీ ఇద్దరిని చంపాలన్నంత కోపం వస్తుంది. కానీ నేనేలా నా బిడ్డను చంపుకోగలను. అందుకే నేనే ఈ లోకం విడిచిపెట్టి పోతున్నాను" అంటు రాసుకొచ్చాడు.
ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ పని తీరును కూడా ప్రశ్నించాడు సంజు."నా బిడ్డ చేసింది తప్పు. ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో అతడు డబ్బుకోసం నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. అతడికి కుమార్తెలు లేరా.. ఓ తండ్రి బాధ ఆయనకు అర్థం కాదా.. ఆయన వల్ల ఓ కుటుంబం అంతా నాశనం అయ్యింది.. సమాజంలో ఆ కుటుంబానికి ఇప్పుడేం మిగల్లేదు" అని చెప్పుకొచ్చాడు.
"నేను మళ్లీ చెబుతున్నాను. ఆర్య సమాజ్‌లో చేసే వివాహం చెల్లదు. మరి కోర్టు ఎలా అమ్మాయిని.. ఆ అబ్బాయితో కలిసి ఉండమని చెప్పింది. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నాశనం చేసింది. నా బాధ ఎవరికి అర్థం కాదు‘‘ అంటూ తన ఆవేదనను తెలిపాడు.
పోలీసులు మాట్లాడుతూ.. "ఇది విషాదకర సంఘటన. సంజు కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. తండ్రికి అది నచ్చక.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు" అని తెలిపాడు. ఈ వార్త తెలిసిన వాళ్లు.. పిల్లలకు ఎందుకు కన్న వాళ్ల బాధ, ఆవేదన అర్థం కాదు. కొన్నాళ్ల పరిచయానికే కన్నవాళ్లను కాదనుకుంటారు. నిజంగా వారి జీవితంలో సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు అంగీకరిస్తారు. కానీ మైనార్టీ పూర్తి కాగానే వివాహం చేసుకుని.. జీవితంలో ఎలా ముందుకు సాగుతారు.. తర్వాత ఏమైన జరిగితే.. ఎవరిది బాధ్యత అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఇవి కూడా చదవండి:
Tahawwur Rana: NIA కస్టడీలో అవి కావాలని కోరిన తహవ్వూర్ రాణా.. ఏంటో తెలుసా..
IMD Predictions: ఎండలు మండుతుంటే.. అక్కడ వర్షాలు..మరి హైదరాబాద్‌లో