Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని బహిష్కరించిన అమెరికా... ఇండియాకు రప్పించే ప్రయత్నాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 09:40 PM
ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన అన్మోల్‌ను గత ఫిబ్రవరిలో అమెరికాలో యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi)ను అమెరికా మంగళవారం నాడు బహిష్కరించింది. గత ఏడాది ముంబైలో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2022లో హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ అనుమానితుగా ఉన్నాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన అన్మోల్‌ను గత ఫిబ్రవరిలో అమెరికాలో యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది. దీంతో అతన్ని తమకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరింది.
కాగా, అన్మోల్‌ను తమ దేశం నుంచి బహిష్కరించినట్టు బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీకి అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా ఓ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. 2025 నవంబర్ 18న ఫెడరల్ ప్రభుత్వం అమెరికా నుంచి అన్మోల్ బిష్ణోయ్‌ని బహిష్కరించినట్టు మెయిల్ ద్వారా సమాచారం ఇస్తున్నామని అందులో పేర్కొంది.
ఈ మేరకు అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతన్ని రప్పించేందుకు ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ సహా పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు చేసిన విస్తృత ప్రయత్నాలకు దక్కిన విజయంగా దీనిని చెప్పుకోవచ్చు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేషన్లు అన్నీ అన్మోల్ నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. మళ్లీ శిశథరూర్ ప్రశంసలు
ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.