Shashi Tharoor: మోదీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. మళ్లీ శిశథరూర్ ప్రశంసలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:24 PM
మెకాలే 200 సంవత్సరాల 'బానిస మనసత్వ' వారసత్వాన్ని తొలగించాలని ప్రధాని తన ప్రసంగంలో కీలకంగా పేర్కొన్నారు. భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు పదేళ్ల నేషనల్ మిషన్ కోసం విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల కాలంలో తరచు ప్రశంసిస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Taharoor) మరోసారి ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. మంగళవారంనాడు రామ్‌నాథ్ గోయెంకా ఆరవ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి శశిథరూర్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు కీలక అంశాలను ప్రస్తావించడం, ముఖ్యంగా దేశాభివృద్ధి కోసం నిరంతర కృషి సాగించాలని పిలుపునివ్వడం తనను ఎంతగానో కదిలించిందని శశిథరూర్ తెలిపారు. తాను తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మోదీ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శశిథరూర్ ఒక పోస్ట్ పెట్టారు.
మెకాలే 200 సంవత్సరాల 'బానిస మనసత్వ' వారసత్వాన్ని తొలగించాలని ప్రధాని తన ప్రసంగంలో కీలకంగా పేర్కొన్నారు. భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు పదేళ్ల నేషనల్ మిషన్ కోసం విజ్ఞప్తి చేశారు. ఇండియాపై బలవంతంగా రుద్దిన బానిసత్వ ఆలోచనా విధానం నుంచి విముక్తికి మనమంతా సంకల్పబద్ధులం కావాలనీ, ఈ దిశగా రాబోయే పదేళ్లు చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని శశిథరూర్ తన పోస్టులో వివరిస్తూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. దేశంగా ఆర్థికంగా బలపడటం, ఈ దిశగా ప్రపంచానికి భారత్ ఒక మోడల్ కావడం ప్రధాని తన ప్రసంగంలో ప్రసంగించారని చెప్పారు. భారత్ నిర్మాణాత్మక అభివృద్ధి గురించి మాట్లాడారని అన్నారు. ఎప్పుడూ ఎలక్షన్ మోడ్‌లోనే ఉంటానని అందరూ తనను అంటారని తన ప్రసంగంలో మోదీ చెప్పిన విషయాన్ని శశిథరూర్ గుర్తుచేస్తూ.. ప్రజా సమస్యల విషయంలో ప్రధాని ఎప్పుడూ ఎమోషనల్ మోడ్‌లో ఉంటారని ప్రశంసించారు.
మోదీని శశిథరూర్ ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దౌత్యపరమైన కృషిలో భాగంగా కేంద్రం విదేశాలకు పంపిన ప్రతినిధి బృందంలో శశిథరూర్ ఉన్నారు. మోదీ దౌత్యపరమైన కృషిని శశిథరూర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దృఢమైన ప్రతిస్పందన చాటిచెప్పిందని కొనియాడారు. టారిఫ్‌లపై ట్రంప్‌తో జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ హుందాగా వ్యవహరించారని ప్రశసించారు. అయితే, మోదీని ప్రశంసించిన ప్రతిసారీ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. శశిథరూర్ వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రతినిధులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సమాచారం.. కోడ్‌వర్డ్‌లుగా బిర్యానీ, దావత్
ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.