Share News

Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్షపై చివరి నిమిషంలో మలుపు

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:33 AM

హత్య చేసిందన్న నేరంపై యెమెన్‌ దేశంలో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ 36 కేసు చివరి నిమిషంలో మలుపు తిరిగింది.

Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్షపై చివరి నిమిషంలో మలుపు

ఆదుకోవాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం.. 14న విచారణ

  • 16నే శిక్ష అమలు చేయనున్నట్టు యెమెన్‌ ప్రకటన

  • దౌత్యపరంగా సాయం చేయాలని ఏజీకి సూచన

  • ‘బ్లడ్‌ మనీ’ చెల్లిస్తే శిక్ష రద్దు

న్యూఢిల్లీ. జూలై 10: హత్య చేసిందన్న నేరంపై యెమెన్‌ దేశంలో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ (36) కేసు చివరి నిమిషంలో మలుపు తిరిగింది. ఆమెను భారత ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. దానిపై ఈ నెల 14న విచారణ జరపనున్నట్టు గురువారం సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆమెను ఈ నెల 16న ఉరితీయనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ‘నిమిష ప్రియ- ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌’ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని జస్టిస్‌ సుధాంశు ధులియా, జస్టిస్‌ జోయ్‌మాల బాగ్చీల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేసుపై విచారణ చేపట్టేలోగా దౌత్యపరమైన సహాయం పొందే విషయమై అటార్నీ జనరల్‌ (ఏజీ) కార్యాలయాన్ని సంప్రదించాలని పిటిషన్‌ దాఖలు చేసిన సీనియర్‌ న్యాయవాది రఘేంత్‌ బసంత్‌, న్యాయవాది సుభాష్‌ చంద్రన్‌ కేఆర్‌లను సూచించింది. దౌత్యపరంగా సాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి తెలిపింది. తమ తరఫున సాధ్యమైనంత సాయం చేస్తామని ఇరాన్‌ దేశ దౌత్యాధికారి ఒకరు చెప్పినట్టు తెలిసింది. యెమెన్‌ దేశంలో అంతర్యుద్ధం నడుస్తుండడం, ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో ఆమెకు సహాయం అందించడం కష్టంగా మారింది. హత్యకు గురయిన వ్యక్తి కుటుంబానికి ‘దియాహ్‌’ (రక్తపు సొమ్ము- బ్లడ్‌ మనీ) కింద తగినంత సొమ్ము ఇచ్చి, వారి క్షమాభిక్ష కోరితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా ఆంక్షల కారణంగానే సాధ్యపడడం లేదు. అందువల్ల ఉన్నత స్థాయిలో దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే మార్గమని న్యాయవాదులు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘బ్లడ్‌ మనీ’ చెల్లింపునకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈలోగా మరణశిక్ష అమలును వాయిదా వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు ఆర్థిక సాయం చేయాలని పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. నర్సింగ్‌ శిక్షణను పూర్తి చేసుకున్న నిమిషప్రియ 2008లో యెమెన్‌ వెళ్లి రాజధాని సనాలోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో పనిచేసింది.


యెమెన్‌లో అంతర్యుద్ధం చెలరేగడం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 2014లో ఆమె భర్త, చిన్నపాప అయిన కుమార్తెను తీసుకొని భారత్‌కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం అక్కడే ఉండి స్థానిక వ్యక్తి మెహదీ సాయంతో ఆస్పత్రి ప్రారంభించింది. యెమెన్‌లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోకతప్పలేదు. అతడు మోసగించడంతో నష్టపోయింది. అతడు లాక్కొన్న తన పాస్‌పోర్టును తిరిగి తీసుకునే క్రమంలో 2017లో అతడికి మత్తుమందు ఇచ్చింది. మత్తుమందు డోస్‌ ఎక్కువ కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆరోపణను ఆమెను తిరస్కరించింది. నీళ్ల ట్యాంకులో శవం లభించడంతో హత్యా నేరాన్ని మోపారు. విచారణ జరిపిన కోర్టు ఆమెకు 2020లో మరణశిక్ష విధించింది. ఆమె చేసిన అప్పీలును 2023లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెకు విధించిన మరణశిక్షకు ఆమోదం తెలుపుతూ హౌతీ రెబల్‌ గ్రూపు సుప్రీం కౌన్సిల్‌ హెడ్‌ మహదీ అల్‌ మషాత్‌ జనవరి నెలలో ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా మరణశిక్ష విధింపునకు తేదీని ఖరారు చేశారు. దానిని నిలువరించే దిశగా ప్రస్తుతం భారత్‌లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

Updated Date - Jul 11 , 2025 | 04:33 AM