Mallikarjun Kharge: పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:03 PM
శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు.
న్యూఢిల్లీ: పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని, వాళ్లు వ్యూహం మార్చుకుంటే కొన్ని 'టిప్స్' ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, సభా సమయాల్లో మాత్రం డ్రామాలు వద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. పార్లమెంటరీ మర్యాదలను, పార్లమెంటరీ వ్యవస్థను గత 11 ఏళ్లుగా ప్రభుత్వం అణిచివేస్తూనే ఉందని ఆరోపించారు. గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు హడావిడిగా ఆమోదించారని, కొన్ని బిల్లులు కేవలం 15 నిమిషాల్లో ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదించారని గుర్తుచేశారు. జీఎస్‌టీ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, రైతు వ్యతిరేక చట్టాలు పార్లమెంటు ద్వారా ప్రభుత్వం బుల్డోజింగ్ చేసిన బిల్లులని ఆక్షేపణ తెలిపారు.
నాటకీయ ప్రసంగం
శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు. మణిపూర్ వంటి కీలక అంశాలపై విపక్షాలు అవిశాస్వ తీర్మానం ప్రవేశపెట్టేంతవరకూ ప్రభుత్వం మౌనంగానే ఉండిపోయిందని, ఎన్నికల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒత్తిడికి గురై బీఎల్ఓలు చనిపోతే ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని విమర్శించారు. 'ఓటు చోరీ' వంటి కీలకాంశాలను విపక్షం లేవనెత్తుతూనే ఉంటుందని, ప్రభుత్వం డ్రామాలు కట్టిపెట్టి పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చకు ముందుకురావాలని సూచించారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానత్వం, దేశ విలువైన వనరుల లూటీ వంటివి నిజమైన ప్రజాసమస్యలనీ, అయితే అధికారంలో ఉన్న వారు అధికార దురహంకారంతో డ్రామాలాడుతున్నారని ఖర్గే విమర్శించారు. బిహార్ ఓటమి నుంచి వాళ్లు (విపక్షాలు) బయటకు రావడం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ప్రతికూల ధోరణి రాజకీయాల్లో పనికొస్తుందే కానీ జాతి నిర్మాణానికి సానుకూల ఆలోచనా దృక్పథం అవసరమని, ప్రతికూలతా ఆలోచలను ప్రభుత్వం పక్కనపెట్టి జాతినిర్మాణంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
విపక్షాల ఆందోళన.. లోక్‌సభ మళ్లీ వాయిదా
బాధ నుంచి బయటకు రండి: ప్రతిపక్షాలకు ప్రధాని కీలక సూచన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి