Share News

Kerala Nuns Arrest: దేశంలో హాట్ టాపిక్ గా మారిన కేరళ నన్స్ అరెస్ట్

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:11 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కేరళ నన్స్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. మానవ అక్రమ రవాణా, బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. అయితే, ఈ ఘటన ఇప్పుడు దేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Kerala Nuns Arrest: దేశంలో హాట్ టాపిక్ గా మారిన కేరళ నన్స్ అరెస్ట్
Kerala Nuns arrest

ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో కేరళ నన్స్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దుర్గ్ రైల్వేస్టేషన్‌లో జులై 25న కేరళకు చెందిన ఇద్దరు నన్స్ సిస్టర్ ప్రీతి మేరీ, సిస్టర్ వందన ఫ్రాన్సిస్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మానవ అక్రమ రవాణా, బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. అయితే, ఈ ఘటన ఇప్పుడు దేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్లమెంటు వెలుపల సైతం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పులువురు రాజకీయ నేతలు ప్లకార్డులు చేతబట్టి నిరసనలకు దిగారు. అటు, కేరళ వ్యాప్తంగా క్రిస్టియన్ వర్గాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన ఇద్దరు కేరళ నన్స్ లను వెంటనే విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ డీఎంకే ఎంపీ విల్సన్ .. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజుకు లేఖ రాశారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్‌ సమీపంలో ముగ్గురు గిరిజన యువతులతో కలిసి ప్రయాణిస్తున్న నన్స్‌ను బజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, మతమార్పిడి చేస్తున్నారని నన్స్ మీద బజరంగ్ దళ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు యువతులు స్వచ్ఛందంగా ఉద్యోగ అవకాశాల కోసం ఆగ్రా వెళ్తున్నారని, వారి దగ్గర చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని నన్స్ వాదించారు. అయినప్పటికీ, ఈ ఆరోపణల ఆధారంగా నన్స్‌ను అరెస్టు చేసి దుర్గ్ సెంట్రల్ జైలులో ఉంచారు.


దీంతో నన్స్ అరెస్టు అటు కేరళ, ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ తీవ్ర నిరసనలకు దారితీశాయి. పార్లమెంటు వెలుపల వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. కేరళ నన్స్‌పై తప్పుడు కేసులు బనాయించారని.. వారిని అన్యాయంగా కొట్టి, అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఇది సరైంది కాదని ప్రియాంక గాంధీ మీడియాతో అన్నారు.

Kerala-Nuns.jpgసీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్.. దుర్గ్ జైలులో నన్స్‌ను పరామర్శించి ఈ అరెస్టులను చట్టవిరుద్ధమని ఖండించారు. అవాస్తవ ఆరోపణలతో నన్స్‌ను జైలులో ఉంచారు. బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సాహంతో ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

తెలంగాణ తమిళ క్యాథలిక్ సభ కూడా ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించింది. సమాజ సేవ చేస్తున్న నన్స్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడం సరికాదు.. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమంటూ ర్యాలీలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.

కేరళ ఎంపీ శశిథరూర్ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు. తక్షణమే కేరళ నన్స్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

సైబర్ ముఠా చేతుల్లో తెలుగు యువకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి

వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..

Updated Date - Aug 01 , 2025 | 05:55 PM