Share News

TG ACB: మెరుపు దాడులు.. భారీగా నగదు స్వాధీనం: ఏసీబీ

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:00 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం పేరుతో ప్రజలను పీడించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 145మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశామన్నారు.

TG ACB: మెరుపు దాడులు.. భారీగా నగదు స్వాధీనం: ఏసీబీ
TG ACB

హైదరాబాద్, ఆగస్ట్ 01: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సూచించారు. అవినీతిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృ‌తంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్లు ద్వారా అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసేలా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.


అయితే రాష్ట్రంలో అవినీతి అధికారులపై మెరుపు దాడులు చేసినట్లు చెప్పారు. ఆ క్రమంలో 2025 జులై మాసంలో మొత్తం 22 అవినీతి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ జాబితాలో ట్రాప్ చేయడం, లెక్కకు మించిన ఆదాయం కలిగి ఉండడం, క్రిమినల్ మిస్‌ కండక్ట్ తదితర కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షలు, లెక్కకు మించిన ఆదాయం కేసులో రూ.11.5కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయన్నారు.


అలాగే ఆర్టీఏ, చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ తదితర కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో లెక్కల్లోకి రాని రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి జులై మాసం వరకు 148 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 145 ప్రభుత్వ ఉద్యోగులు / ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే మొత్తం రూ.30.32 లక్షలు ట్రాప్ కేసుల్లో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో ఆస్తుల విలువ రూ.39కోట్లకు పైగా ఉందన్నారు.


మరోవైపు నీటి పారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు.. ఇంజనీర్ ఇన్ చీఫ్ మరళీధర్ రావు, నూనె శ్రీధర్‌తోపాటు మరో ఇంజనీర్‌ హరిరామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అధికారుల వద్దే దాదాపు రూ.1000 కోట్లకు పైగా అవినీతి నగదు ఉన్నట్లు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్

ఆగస్ట్ 10 నుంచి ఏపీ సచివాలయంలో నో ప్లాస్టిక్ బాటిల్స్..

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:50 PM