Arvind Kejriwal: రాజ్యసభ ఊహాగానాలపై కేజ్రీవాల్ క్లారిటీ
ABN , Publish Date - Jun 23 , 2025 | 08:54 PM
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా, వీటిలో రెండు స్థానాలను ఆప్ గెలుచుకుంది. గుజరాత్‌లో ఒక అసెంబ్లీ స్థానాన్ని, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకుంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో తాజాగా వెలువడిన అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి. నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను ఆప్ గెలుచుకుంది. గుజరాత్‌లో ఒక అసెంబ్లీ స్థానాన్ని, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌లోని అధికార బీజేపీతో ప్రజలు విసిగెత్తిపోయారని ఎన్నికలపై ఫలితాలపై అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు మాట్లాడుతూ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆప్ ఎంపీ గెలుపొందడంపై కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారంటూ వస్తున్న ఊహాగానాలపై కూడా ఆయన స్పందించారు.
'నేను రాజ్యసభకు వెళ్లడం లేదు. రాజ్యసభకు ఎవరిని పంపాలనేది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది' అని మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. గుజరాత్‌లోని విసావదార్, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లో ఆప్ అభ్యర్థులు గెలుపొందటంపై ఆనందం వ్యక్తం చేశారు.
'ఫిబ్రవరి ఎన్నికల్లో మేము విసావదార్ సీటులో గెలిచాం. అయితే మా ఎమ్మెల్యే పార్టీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఈరోజు మేము లూథియానా వెస్ట్‌తో సహా రెండు సీట్లు డబుల్ మార్జిన్‌తో గెలిచాం. పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి లూథియానా వెస్ట్‌లో మా అభ్యర్థి విజయమే నిదర్శనం. కానీ గుజరాత్‌లో బీజేపీ అధికారికంలో ఉన్నప్పటికీ ప్రజలు డబుల్ మార్జిన్‌తో మమ్మల్ని గెలిపించారు. దానిని బట్టే బీజేపీ పట్ల ప్రజలు విసిగిపోయారని అర్ధమవుతుంది' అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీతో కాంగ్రెస్‌కు లోపాయికారీ సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని విడిచిపెట్టి ఆప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. బీజేపీతో పోరాట గలిగే పార్టీ ఆప్ మాత్రమేనని చెప్పారు. గుజరాత్‌లో బీజేపీ, ఆప్ మధ్యనే పోటీ ఉంటుందని, బీజేపీకి విజయం సాధించిపెట్టేందుకు కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ అరోరా పంజాబ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి గెలుపొందటంతో ఆయన రాజ్యసభ సీటుకు రాజీనామా చేయనున్నారు. దీంతో అరోరా స్థానంలో మరొకరిని పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లొచ్చంటూ విపక్ష పార్టీలు ఊహాగానాలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News