Mamata Banerjee: అమిత్‌షాను నియంత్రించండి.. మోదీకి మమత అప్పీల్
ABN , Publish Date - Apr 16 , 2025 | 09:15 PM
దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించడంలో టీఎంసీ ముందుందని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్రంలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత రీకాల్ చేస్తామని స్పష్టం చేశారు.

కోల్‌కతా: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో నిరసన హింసాత్మకంగా మారడం వెనుక ముందస్తు వ్యూహం ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. రాష్ట్రాన్ని చిక్కుల్లో నెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఘర్షణల్లో బీఎస్ఎఫ్ పాత్రపైనా దర్యాప్తు చేయాలని అన్నారు. వ్యక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయవద్దని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను నియంత్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మమతాబెనర్జీ కోరారు.
Supreme Court: ఆలయ బోర్డులలో ముస్లింలకు చోటిస్తారా? కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న
బెంగాల్‌లో హింసాకాండ వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందని నిఘా వర్గాలు తమకు తెలిపినట్టు మమత చెప్పారు. "ముర్షీదాబాద్ హింసాకాండలో బంగ్లాదేశ్ ప్రమేయం ఉందని హోం మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఒక ట్వీట్ ఏఎన్ఐలో చూశాను. ఇదే నిజమైతే, ఇందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. సరిహద్దు రక్షణ బాధ్యత చూసుకునేది బీఎస్ఎఫ్. రాష్ట్ర ప్రభుత్వం కాదు. బయట నుంచి వచ్చిన అల్లర్లు సృష్టించేందుకు బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారు'' అని సీఎం అన్నారు. ఘర్షణల్లో బీఎస్ఎఫ్ పాత్రపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మమత ఆదేశించారు.
దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించడంలో టీఎంసీ ముందుందన్నారు. బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్రంలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత రీకాల్ చేస్తామని మమత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...