Heart Attacks: హాసన్‌లో హడలెత్తిస్తున్న గుండెపోటు మరణాలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:54 AM
కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 40 రోజుల వ్యవధిలో జిల్లాలో 24 మంది గుండెపోటుతో మృతిచెందారు.

40 రోజుల్లో 24 మంది మృతి తీవ్ర ఆందోళనలో కర్ణాటకలోని
హాసన్ జిల్లా ప్రజలు విచారణకు ఆదేశించిన సీఎం
బెంగళూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 40 రోజుల వ్యవధిలో జిల్లాలో 24 మంది గుండెపోటుతో మృతిచెందారు. తాజాగా మంగళవారం సంజయ్(27) అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. హొళెనరసీపుర తాలూకా సోమనహళ్లికి చెందిన సంజయ్, తన మిత్రులతో కలసి పార్టీకి వెళ్లిన సమయంలో సోమవారం సాయంత్రం బీపీ ఎక్కువైంది. ఛాతీలో నొప్పి రావడంతో మిత్రులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అంతలోనే సంజయ్ గుండెపోటుతో మృతి చెందాడు.
బీపీ ఎక్కువ కావడమే గుండెపోటుకు కారణమని జయదేవ ఆసుపత్రి మాజీ డైరెక్టర్, ఎంపీ మంజునాథ్ తెలిపారు. మధుమేహం, ఆహారశైలి కూడా దీనికి కారణం కావచ్చునని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమీప ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, జిల్లాలో వరుసగా గుండెపోటుతో మృతి చెందుతుండడంతో సీఎం సిద్దరామయ్య స్పందించారు. కారణాలను తెలుసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని జయదేవ హృద్రోగ ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్‌ను ఆదేశించారు. ఆయన నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.