Karnataka: 1,777 ఎకరాల భూసేకరణ ప్రతిపాదన రద్దు.. సీఎం సంచలన ప్రకటన
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:12 PM
బెంగళూరు రూరల్ జిల్లా చెన్నరాయపట్న హొబ్లి, సమీప గ్రామాల్లో 1,77 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మూడున్నర ఏళ్లుగా రైతులు, ల్యాండ్ రైట్ యాక్టివిస్టులు తీవ్ర నిరసనలు సాగిస్తున్నారు.

బెంగళూరు: దేవనహళ్లి తాలూకా రైతులు సుదీర్ఘ పోరాటం తర్వాత కీలక విజయం సొంతం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని చెన్నరాయపట్న హొబ్లి వద్ద 1,777 ఎకరాల రైతు భూములను సేకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మంగళవారంనాడు ప్రకటించారు.
బెంగళూరు రూరల్ జిల్లా చెన్నరాయపట్న హొబ్లి, సమీప గ్రామాల్లో 1,777 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మూడున్నర ఏళ్లుగా రైతులు, ల్యాండ్ రైట్ యాక్టివిస్టులు తీవ్ర నిరసనలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో హై-టెక్ డిఫెన్స్, ఏరోస్పేష్ పార్క్ పెట్టాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
ఉన్నత స్థాయి సమావేశం
రైతుల సుదీర్ఘ ఆందోళన నేపథ్యంలో సిద్ధరామయ్య అధ్యక్షతను మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, రైతు సంఘాలు, భూముల యజమానులు, ల్యాండ్ రైట్స్ యాక్టివిస్టులు విధానసౌధలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. భూసేకరణకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రైతుల నుంచి మాత్రమే పరిహారం చెల్లించి భూములు సేకరించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రతిపాదిత భూసేకరణ ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్టు సమావేశానంతరం సిద్ధరామయ్య ప్రకటించారు. స్వచ్ఛందంగా ఎవరైనా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అభ్యంతరం లేదన్నారు. తగిన పరిహారం ఇచ్చిన వాటిని సేకరిస్తామని తెలిపారు. భూసేకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం చరిత్రాత్మకమని ప్రశంసించారు. దేవనహళ్లిలో పారిశ్రామిక ప్రగతి కీలకమని, అయితే అక్కడి భూములు పంటపొలాలు కావడం, రైతులు దానిపై ఆధారపడుతుండటంతో ప్రభుత్వం భూసేకరణ ప్రతిపాదనను విరమించుకుందని వివరించారు. ప్రభుత్వం నిర్ణయంతో రైతులు, రైతు సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ ప్రధాని అవుతాడని మీకు తెలుసా.. పిటిషనర్‌పై ముంబై హైకోర్టు ఆగ్రహం
ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవాడు: ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి