Share News

Karnataka: సిద్దు సీఎం కుర్చీ సేఫ్‌?!

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:49 AM

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య బాధ్యతలు చేపట్టింది మొదలు..

Karnataka: సిద్దు సీఎం కుర్చీ సేఫ్‌?!

  • ‘ఐదేళ్లూ నేనే సీఎం’ వ్యాఖ్యల వెనుక అధిష్ఠానం!

  • రాహుల్‌ భరోసాతో సిద్దూలో ధీమా

బెంగళూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య బాధ్యతలు చేపట్టింది మొదలు.. రాష్ట్రంలో సీఎం మార్పు అంశంపై చర్చ లేని రోజు లేదంటే అతిశయోక్తి లేదు! ఇటీవల జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో సీఎం మార్పు ఉండబోదని, ఆ దిశగా అధిష్ఠానం సంకేతాలు ఇచ్చిందనే చర్చకు దారితీశాయి. సీఎం సిద్దరామయ్య గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ‘ఐదేళ్లు నేనే సీఎంగా ఉంటాను. కుర్చీ ఖాళీగా లేదు. నా సారథ్యంలోనే 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి’ అని చెప్పడం వెనుక రాహుల్‌గాంధీ సందేశం ఉందా? అనే చర్చ జరుగుతోంది. రాహుల్‌ దిశానిర్దేశ మే సిద్దరామయ్య ధీమాకు కారణమనే అభిప్రాయా లు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీలో మూడు రోజులు మకాం వేసిన సిద్దూ.. నాయకత్వ మార్పు అంశంపై హైకమాండ్‌ వద్ద చర్చ లేదని పేర్కొన్నారు.


మౌనంగా ఉండమని ఖర్గే చెప్పారు: డీకే

మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌గా, మొండి నాయకుడిగా ముద్రపడిన డీకే శివకుమార్‌.. రెండు రోజులుగా మౌనం పాటిస్తున్నారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనంగా ఉండాలని సూచించారని, అదే పాటిస్తున్నానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చాక నాయకత్వ మార్పు గురించి మాట్లాడడం సరికాదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీకే శివకుమార్‌ సన్నిహిత నేత లు ఆయన త్వరలో సీఎం అవుతారంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎంలు మూడు రోజులు మకాం వేసినా, రాహుల్‌గాంధీ ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం గమనార్హం.

Updated Date - Jul 12 , 2025 | 05:49 AM