Share News

Delhi High Court Judge: నగదు దొరికితే దోషినా

ABN , Publish Date - Jul 19 , 2025 | 03:28 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

Delhi High Court Judge: నగదు దొరికితే దోషినా
Delhi High Court Judge

ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా పెట్టారో తేల్చలేదు.. ఆ నగదుకు యజమాని ఎవరో గుర్తించలేదు

  • అగ్ని ప్రమాదానికి కారణాలనూ తేల్చలేదు

  • అంతర్గత విచారణంతా లోపాలమయం

  • హైకోర్టు జడ్జిపై విచారణకు ఆదేశించే అధికారం సీజేఐకి లేదు

  • సుప్రీం కోర్టులో జస్టిస్‌ వర్మ పిటిషన్‌

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అధికారిక నివాసంలో పెద్దఎత్తున దొరికిన నగదుకు భారత ప్రధాన న్యాయమూర్తి నియమించిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ (పంజాబ్‌, హరియాణా చీఫ్‌ జస్టిస్‌ షీల్‌ నాగ్‌; హిమాచల్‌ ప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ జీఎస్‌ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌) తనను దోషిగా నిర్ధారించడానికి చేపట్టిన ప్రక్రియ చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఎక్కడా మచ్చ లేకుండా 11 ఏళ్లు న్యాయమూర్తిగా పని చేశానని, విచారణ కమిటీ చేపట్టిన ప్రక్రియే లోపాలమయమని, తన వాదన వినిపించుకోవడానికి తనకు తగినంత సమయం ఇవ్వలేదని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. జస్టిస్‌ వర్మ అధికారిక నివాసంలో మార్చి 14వ తేదీ రాత్రి అగ్ని ప్రమాదం జరగడం.. సగం కాలిన నోట్లు దొరకడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోరా కేంద్ర హోం శాఖకు, ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సకు నివేదించారు. ఈ నేపథ్యంలోనే, సుప్రీం కోర్టు అప్పటి చీఫ్‌ జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. నాలుగైదు గోనె సంచుల్లో సగం కాలిన రూ.500 నోట్లు దొరికాయని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నివేదించిన విషయాన్ని తన నివేదికలో కమిటీ ప్రస్తావించింది. జస్టిస్‌ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌ రూమ్‌లో నగదు దొరికిన విషయం నిజమేనని భౌతిక, ఎలకా్ట్రనిక్‌ ఆధారాలు, నిపుణులు అందించిన సాక్ష్యాధారాలను బట్టి తేల్చినట్లు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సకు నివేదించింది. సరిగ్గా, ఈ అంశంపైనే జస్టిస్‌ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘నా అధికారిక నివాసం స్టోర్‌ రూమ్‌లో నగదు దొరికినంత మాత్రాన నా దోషిత్వం నిరూపించినట్లు కాదు. ఆ నగదుకు యజమాని ఎవరనే విషయాన్ని కమిటీ గుర్తించలేదు. నిర్దిష్ట సాక్ష్యాధారాలతో కమిటీ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించలేదు. ఏవో కొన్ని ఊహాగానాల ఆధారంగా వచ్చారు. నా దృష్టిలో అవి చెల్లవు. ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి.. దాని ఆధారంగా కమిటీ విచారణ ప్రక్రియను హడావుడిగా చేసేసింది.


నాకు తగినంత సమయం ఇవ్వలేదు. ఔట్‌హౌస్‌ లో నగదు దొరికిందనే అంశంతో నాకు ఎటువంటి విభేదం లేదు. నగదు దొరికినంత మాత్రానే నేను తప్పు చేశానని చెప్పలేరు. ఆ నగదుకు యజమాని ఎవరు!? అది ఎవరి నియంత్రణలో ఉందనే అంశంపై నిర్దిష్ట ఆధారాల్లేకుండా నాకు సంబంధం అంటగట్టలేరు. నగదును ఔట్‌ హౌస్‌లో ఎవరు, ఎప్పుడు, ఎలా పెట్టారు!? ఎంత నగదు ఉంచారు? ఆ నగదు అసలుదా కాదా!? అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి? కాలిన నగదు అవశేషాల తొలగింపులో పిటిషనర్‌కు ఏమైనా సంబంధం ఉందా!? అనే అంశాలకు విచారణ కమిటీ జవాబు చెప్పాల్సి ఉంది’’ అని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కమిటీ నివేదికలో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేదని, అందువల్ల, తనను దోషిగా తేల్చలేరని అభ్యంతరం వ్యక్తం చేశారు. నగదు దొరికినంత మాత్రాన తుది నిర్ణయానికి రాలేరని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకమా లేక ప్రమాదవశాత్తు జరిగిందా!? అన్న అంశమూ కీలకమన్నారు. తాను కోరినా సీసీటీవీ ఫుటేజి వంటి ఆధారాలను సేకరించడంలో కమిటీ విఫలమైందని, వ్యక్తిగత విచారణకు నిరాకరించిందని, తనపై నిర్దిష్టంగా ఎటువంటి కేసు పెట్టలేకపోయిందని, పైగా, తనకు తెలియకుండానే నిరూపించుకునే భారాన్ని తిరిగి తనపై మోపిందని ఆరోపించారు. అంతేనా, అంతర్గత విచారణకు ఎటువంటి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. విచారణ కమిటీని నియమించడం అధికార దుర్వినియోగమని ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సకు ఇవ్వలేదని, అంతర్గత విచారణకు ఆయన ఆదేశించజాలరని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా తనను తొలగించాలంటూ సిఫారసు చేయజాలరని తెలిపారు. విచారణకు ముందే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను బహిర్గతపరిచారని, తద్వారా తన గౌరవానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

ప్రభుత్వానికి సంబంధం లేదు: కేంద్ర న్యాయ మంత్రి

జస్టిస్‌ వర్మపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే అంశం పూర్తిగా ఎంపీలకు సంబంధించిన అంశమని, ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వ్యాఖ్యానించారు. అంతర్గత కమిటీ తన నివేదికను సమర్పించిందని, దానితో విభేదిస్తే జస్టిస్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. లోక్‌సభలో వంద మంది; రాజ్యసభలో 50 మంది సభ్యుల మద్దతు ఉంటే న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించవచ్చని తెలిపారు. కాగా, జస్టిస్‌ వర్మకు వ్యతిరేకంగా పెట్టే అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని, తీర్మానంపై కాంగ్రెస్‌ ఎంపీలు కూడా సంతకాలు చేస్తారని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. ఆయనను తొలగించాలంటూ రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి అప్పటి సీజేఐ సంజీవ్‌ ఖన్నా లేఖ రాయడం ద్వారా తమకు ఇష్టం లేకపోయినా తీర్మానాన్ని ఆమోదించక తప్పడం లేదని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 03:28 AM