Share News

Political Tension: గోడ దూకిన జమ్మూకశ్మీర్‌ సీఎం

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:11 AM

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1931 జూలై 13న జరిగిన ఘటనలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించే విషయంలో వివాదం రేగింది.

Political Tension: గోడ దూకిన జమ్మూకశ్మీర్‌ సీఎం

కశ్మీర్‌ అమరవీరుల కార్యక్రమానికి ఎల్జీ అనుమతి నిరాకరణ.. ఆంక్షల మధ్య శ్మశాన వాటికకు ఒమర్‌

  • ముఖ్యమంత్రిని అడ్డుకున్న పోలీసులు

  • గోడెక్కి లోపలికి వెళ్లి.. నివాళులు

శ్రీనగర్‌, జూలై 14: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1931 జూలై 13న జరిగిన ఘటనలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించే విషయంలో వివాదం రేగింది. కేంద్రం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వర్సెస్‌ జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అనేలా పరిస్థితులు తలెత్తాయి. గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆదేశాల మేరకు నౌహట్టాలోని ‘మజర్‌ ఏ శుహదా’ శ్మశానవాటికలోని సమాధుల వద్దకు నేతలు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల దినం నిర్వహించకుండా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేతలను ఆదివారం హౌస్‌ అరెస్టు చేశారు. ఒమర్‌ అబ్దుల్లాను ఇంటి నుంచి బయటకు రాకుండా చేశారు. శ్మశానం గేటుకు కూడా తాళాలు వేశారు. అయితే సోమవారం ఎట్టకేలకు ఆంక్షలను ధిక్కరించి, ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చిన సీఎం.. శ్మశానవాటిక వద్దకు వెళ్లారు. అక్కడ భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకోవడంతో.. క్యాబినెట్‌ మంత్రులతో సహా గోడ దూకి లోపలికి వెళ్లారు. అమరవీరుల సమాధుల వద్ద నివాళులర్పించారు.


ఈ వీడియోను ఒమర్‌ అబ్దుల్లా ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ.. ‘‘1931 జూలై 13 నాటి ఘటన అమరవీరులకు నివాళులు అర్పించాం. ‘ఎన్నిక కాని ప్రభుత్వం’ నన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి, నౌహట్టా చౌక్‌ నుంచి నడిచి వెళ్లేలా చేసింది. గేటును బ్లాక్‌ చేయడంతో గోడ దూకాల్సి వచ్చింది. నన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ నన్ను ఈ రోజు ఆపలేకపోయారు’ అని పేర్కొన్నారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు. ‘నేనేమీ చట్టవిరుద్ధంగానో, అక్రమంగానో వ్యవహరించలేదు. చట్ట పరిరక్షకులమని చెప్పుకుంటున్న వారు నన్ను ఏ చట్టం ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌ చరిత్రలో 1931 జూలై 13న జరిగిన ఘటనను కీలకంగా చెబుతుంటారు. ఆ రోజున మహారాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా శ్రీనగర్‌ జైలు బయట ఆందోళన చేస్తున్న అబ్దుల్‌ ఖాదిర్‌ మద్దతుదారులపై డోగ్రా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. నాటి ఘటనను స్మరించుకుంటూ ఏటా జూలై 13న తేదీన అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 05:11 AM