Omar Abdullah: గృహనిర్బంధం నడుమ.. గోడ దూకిన జమ్మూకశ్మీర్ సీఎం
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:50 PM
తనను గృహ నిర్బంధంలో ఉంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని, మళ్లీ తనను అడ్డుకునే అవకాశం ఇవ్వకూడదనే కారణంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇక్కడకు వచ్చానని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఈరోజు కూడా తనను అడ్డుకున్నప్పటికీ వాళ్ల ప్రయత్నాలను భగ్నం చేశానని చెప్పారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) 'అమర వీరుల దినోత్సవం' సందర్భంగా వారి శ్మశానవాటిక అయిన 'మజర్ ఎ శుహాదా'కు సోమవారం నాడు తన మద్దతుదారులతో కలిసి వెళ్లారు. నౌహట్టాలోని ఈ శ్మశానవాటిక గోడ దూకి లోపలకు వెళ్లారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒమర్ గోడ దూకుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అనంతరం మీడియాతో ఓమర్ మాట్లాడుతూ.. శనివారం నాడు తనను గృహనిర్బంధంలో ఉంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని, మళ్లీ తనను అడ్డుకునే అవకాశం ఇవ్వకూడదనే కారణంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈరోజు కూడా తనను అడ్డుకున్నప్పటికీ వాళ్ల ప్రయత్నాలను భగ్నం చేశానని చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఒమర్ ఇంటి ముందు బంకర్ ఎత్తేశారు. దీంతో సోమవారం ఆయన ఎవరికీ సమచారం ఇవ్వకుండా కారు నడుపుకుంటూ అమరవీరుల శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ వారు అనుమతించకపోవడంతో అమాంతం గోడదూకి వెళ్లారు.
మేము బానిసలం కాదు..
శాంతి భద్రతలకు బాధ్యులని చెప్పుకుంటున్న వారు శనివారం నాడు ఫాతిహాకు హాజరుకాకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని, ప్రతి ఒక్కరినీ ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారని ఒమర్ చెప్పారు. మజర్‌కు వెళ్లాలనుకుంటున్నట్టు తాను సమాచారం ఇవ్వగానే తన ఇంటి వెలుపల పోలీసు బంకర్లు ఏర్పాటు చేశారని, తమను అడ్డుకోవడంపై చట్టబద్ధతను తాను ప్రశ్నించానని చెప్పారు. 'ఇది స్వేచ్ఛాయుత దేశమని వాళ్లు చెబుతారు. అయితే మమ్మల్ని బానిసలుగా భావిస్తుంటారు. మేము ఎవరికీ బానిసలం కాదు. మేము ఇక్కడి ప్రజలకే బానిసలం' అని చెప్పారు.
ఫిజికల్ టార్చర్..
దీనికి ముందు శనివారం నాడు ఒక వీడియోను ఒమర్ అబ్దుల్లా విడుదల చేశారు. ఇది ఫిజికల్ టార్చర్ కాదా? అని ప్రశ్నించారు. 'ఫిజకల్‌గా టార్చర్ చేశారు. ఉక్కు సంకల్పంతో ఉన్నందున నన్ను ఆపలేరు. నేనేమీ చట్టవిరుద్ధంగానో, అక్రమంగానో వ్యవహరించడం లేదు. చట్టపరిరక్షకులమని చెప్పుకుంటున్న వారు ఏ చట్టం ప్రకారం నన్ను ఫాతిహాకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది' అని ట్వీట్ చేశారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ రాగానే తనను హౌస్ అరెస్టు చేశారని చెబుతూ తన ఇంటి వెలుపల ఉన్న పోలీసుల ఫోటోలను మరో ట్వీట్‌లో ఆయన షేర్ చేశారు. 'ఎన్నిక కాని ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వాన్ని లాకప్‌లో ఉంచింది' అని కామెంట్ చేశారు.
కశ్మీర్ అమరవీరుల దినోత్సవం అంటే..
కశ్మీర్ చరిత్రలో జూలై 13న జరిగిన ఘటన కీలకంగా చెబుతారు. 1931 జూలై 13న కశ్మీర్ రాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కశ్మీరీ ఆందోళనకారులను హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపాయి. ఈ ఘటనను పురస్కరించుకుని ఏటా జూలై 13న అమరవీరుల దినం జరుపుతారు. కాగా, అమరవీరుల దినోత్సవం నిర్వహించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యంత్రాంగం జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు విధించింది. అమరవీరుల శ్మశాన వాటికకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
ఆ పైలెట్లు బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పాసయ్యారు: ఏఐ సీఈఓ
'నిమిష' ఉరిశిక్షను ఆపలేం.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి