Share News

Jagdeep Dhankhad Resigns: విమర్శలు.. పరుష వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:43 AM

తన పదవీకాలం ముగియడానికి రెండేళ్ల ముందే.. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ మూడు దశాబ్దాలుగా ..

Jagdeep Dhankhad Resigns: విమర్శలు.. పరుష వ్యాఖ్యలు..
Jagdeep Dhankhad Resigns

  • బెంగాల్‌ గవర్నర్‌గా, ఉపరాష్ట్రతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీరిదీ!

  • 2022 ఆగస్టు 11న భారత 14వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు

  • న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై పలు సందర్భాల్లో తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ, జూలై 21: తన పదవీకాలం ముగియడానికి రెండేళ్ల ముందే.. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌.. 1951లో మే 18వ తేదీన రాజస్థాన్‌లోని కిఠానా గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తొలుత 1989లో జనతాదళ్‌ అభ్యర్థిగా రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1991 దాకా లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఝున్‌ఝును లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచీ కొంతకాలంపాటు సీరియ్‌సగా న్యాయవాద వృత్తిపైనే దృష్టి సారించారు. మళ్లీ, 2003లో బీజేపీలో చేరిన ఆయన.. అప్పట్నుంచీ ఆ పార్టీలోనే కొనసాగారు. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. 2019 జూలై 20న.. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన్ను పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమించారు. అప్పట్నుంచీ.. రాజకీయ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో తన పోస్టుల ద్వారా మమత సర్కారుపై ధన్‌ఖడ్‌ విమర్శలు గుప్పించేవారు. దీదీ సర్కారుతో వ్యవహరించిన తీరుతో ఆయన పేరు దేశవ్యాప్తంగా తెలిసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను.. ‘నిజమైన విపక్షనేత’గా అభివర్ణించిందంటే బెంగాల్‌ ప్రభుత్వంతో ఆయన ఏ స్థాయిలో ఘర్షణ వైఖరితో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.


చివరకు.. 2022 జనవరిలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆయన పోస్టులను చూడలేక.. విసుగుతో ఆయన తనను ట్విటర్‌లో ట్యాగ్‌ చేయడానికి వీల్లేకుండా ఆయన ఖాతాను బ్లాక్‌ చేశారు. 2022లో ఎన్డీయే కూటమి ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దించడంతో.. గవర్నర్‌ పదవికి 2022 జూలై 17న ఆయన రాజీనామా చేశారు. 2022 ఆగస్టు 11న భారత 14వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతిగా ఉంటూనే న్యాయవ్యవస్థపై.. ముఖ్యంగా న్యాయనియామకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిల్లులు ఆమోదించే విషయంలో.. రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పును తప్పుబట్టారు. దేశంలో చట్టాలు చేసేదీ వారే.. వాటిని అమలుచేసేదీ వారే అన్నట్టుగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 142.. ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగానూ.. 24 గంటలూ న్యాయవ్యవస్థకు అందుబాటులో ఉండే అణు క్షిపణిలా మారిందని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:43 AM