Military Strikes: ఇస్ఫహాన్ అణుకేంద్రంపై దాడి
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:32 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) శనివారం ముప్పేట దాడులు చేసింది. ఇస్ఫహాన్ అణ్వాయుధ కేంద్రంలోని రెండు సెంట్రీఫ్యూజ్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించగా.

రెండు సెంట్రీఫ్యూజ్ యూనిట్లు ధ్వంసం.. రాడార్ కేంద్రం, గగనతల రక్షణ వ్యవస్థ కూడా
టెల్‌అవీవ్/టెహ్రాన్, జూన్ 21: ఇరాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) శనివారం ముప్పేట దాడులు చేసింది. ఇస్ఫహాన్ అణ్వాయుధ కేంద్రంలోని రెండు సెంట్రీఫ్యూజ్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించగా.. దీన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) నిర్ధారించింది. ‘‘సెంట్రీఫ్యూజ్ యూనిట్లపై దాడికి 150 బాంబులు/డ్రోన్లు/క్షిపణులను వినియోగించాం. ఆ యూనిట్లను పూర్తిస్థాయిలో ధ్వంసం చేశాం’’ అని ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాలతోపాటు.. ఆ దేశ అణు శాస్త్రవేత్తలు, మిలటరీ అధికారులను ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అణుశాస్త్రవేత్తలు, ముగ్గురు మిలటరీ అధికారులు, ఒక మాజీ అధికారిని మట్టుబెట్టినట్లు తెలిపింది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగగా.. టెహ్రాన్, తబ్రీజ్, ఖోమ్ ప్రాంతాల్లోని గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఖోమ్ నగరంలో పౌర ఆవాసాలపై బాంబులు పడడంతో.. 16 ఏళ్ల బాలుడు, మరో వ్యక్తి చనిపోయారని ఇరాన్ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లోని అహ్వాజ్ నగరం దాకా ఇజ్రాయెల్ వైమానిక దళం చేరుకుందని సబ్రీన్ వార్తాసంస్థ నివేదించింది.
శాస్త్రవేత్తలే టార్గెట్
ఐడీఎఫ్ శనివారం నాటి దాడుల్లో ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ చీఫ్ హుస్సేన్ తైబ్ చనిపోయారని ఐడీఎఫ్ వెల్లడించింది. ఐఆర్‌జీసీకి చెందిన డ్రోన్ల యూనిట్ డివిజన్ కమాండర్ ఆమిన్ పోర్‌జొడాకీని మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్‌లోని పాలస్తీనా కార్ప్స్ కమాండర్ సయీద్ ఇజాదీని ఖోమ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి ఈయనే నిధులు సమకూర్చారని కాట్జ్ ఆరోపించారు. ఖుద్స్ ఫోర్స్‌కు చెందిన వెపన్స్ ట్రాన్స్‌ఫర్ యూనిట్(190) కమాండర్ బహ్నమ్ షహర్యారీ కూడా తాజా దాడుల్లో హతమైనట్లు ఐడీఎఫ్ వివరించింది. అణుశాస్త్రవేత్త ఇసార్ తబతాబాయి కషే ఇంటిపై జరిపిన డ్రోన్ దాడిలో కషే, ఆయన భార్య చనిపోయినట్లు వివరించింది. టెహ్రాన్‌లో జరిపిన దాడిలో బాలిస్టిక్ క్షిపణి నిపుణుడు, న్యూక్లియర్ శాస్త్రవేత్త సయ్యద్ అస్గర్ హతమైనట్లు తెలిపింది.
ఇరాన్‌కు ఆ ఉద్దేశం లేదు: పుతిన్
ఇరాన్‌కు అణ్వాయుధాలను సంపాదించే ఉద్దేశం లేదని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు పదేపదే చెబుతున్నానని వివరించారు. ఇజ్రాయెల్‌కు ఏమైనా ఆందోళనలు ఉంటే.. వాటిని పరిష్కరించుకోవాలని, దానికి ఓ మార్గం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శుక్రవారం తన వారసులను ప్రకటించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆయన మూడు పేర్లను ప్రతిపాదించినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఆరు స్టెల్త్ బీ-2 బాంబర్ విమానాలను ఆ ప్రాంతానికి పంపిస్తోంది. ఇదిలా ఉండగా, ఉత్తర ఇరాన్‌లోని సెమ్నాన్‌లో శనివారం 5.1తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ క్షిపణి కాంప్లెక్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో, ఇక్కడ ఇరాన్ అణుపరీక్షలు జరిపి ఉంటుందని, అందుకే భూప్రకంపనలు వచ్చాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీలంక, నేపాలీలనూ.. వెనక్కి రప్పిస్తున్న భారత్
ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత సర్కారు ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించిన విషయం తెలిసిందే..! ఈ ఆపరేషన్‌లో భాగంగా సోమవారం 256 మంది భారతీయులు న్యూఢిల్లీకి చేరుకోగా.. ఇప్పటి వరకు 827 మందిని వెనక్కి రప్పించామని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి ఇరాన్‌లోని శ్రీలంక, నేపాల్ జాతీయులను కూడా వెనక్కి రప్పించనున్నట్లు ప్రకటించింది. ఆయా దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.