Share News

Iran: ఆ సాహసం మేమే చేశాం

ABN , Publish Date - Jun 25 , 2025 | 06:49 AM

అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ధైర్యం, సాహసం ఏ దేశానికీ లేదని.. అలాంటి సాహసం తామే చేశామని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ ఇరాజ్‌ ఇలాహీ తెలిపారు.

Iran: ఆ సాహసం మేమే చేశాం

  • అమెరికా సైనిక స్థావరాలపై దాడిచేసే ధైర్యం ఎవరికీ లేదు

  • అవసరమైతే మళ్లీ దాడి చేస్తాం.. మా వద్ద అణ్వాయుధాలు లేవు

  • ట్రంప్‌ పక్కా స్వార్థ జీవి.. భారత్‌లో ఇరాన్‌ రాయబారి ఇరాజ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 24: అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ధైర్యం, సాహసం ఏ దేశానికీ లేదని.. అలాంటి సాహసం తామే చేశామని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ ఇరాజ్‌ ఇలాహీ తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా తమపై దండెత్తే అవకాశం ఉందని ముందుగానే ఊహించామని.. తదనుగుణంగా స్పందించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలలో అమెరికా జోక్యం చేసుకుంటుందని ముందుగానే ఊహించాం. అందుకే మేం సర్వసన్నద్ధమయ్యాం. చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేశం కూడా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. కానీ, ఇరాన్‌ చేసి చూపింది. మీరు దీనిని ప్రతీకాత్మక స్పందనగా భావించవచ్చు.


కానీ, మరోసారి అమెరికా రెచ్చిపోతే అంతేస్థాయిలో మా స్పందన తీవ్రంగా ఉంటుంది’’ అని ఇలాహీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ నమ్మదగిన వ్యక్తికాదని ఇలాహీ వెల్లడించారు. ‘‘నెతన్యాహూ నమ్మదగిన వ్యక్తి కాదు. ఇరాన్‌పై ఆయనే సైనిక దాడిని ప్రారంభించారు. జనావాసాలను లక్ష్యంగా చేసుకున్నారు. దానికి బదులు తీర్చుకునేందుకు మేం కూడా సిద్ధమే.’’ అని ఇలాహీ స్పష్టం చేశారు. ఇరాన్‌ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిందన్న ఆయన.. తమవద్ద ఎలాంటి అణ్వాయుధాలూ లేవని తెలిపారు. ‘‘ఎన్‌పీటీలో ఇరాన్‌ సభ్య దేశం. మా వద్ద ఎలాంటి అణ్వాయుధాలూ లేవు. అయితే, మావద్ద యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయన్న నెపంతో ఇజ్రాయెల్‌ దాడికి తెగబడింది. పశ్చిమాసియాలో సుస్థిరతను దెబ్బతీసింది.’’ అని వెల్లడించారు. ఇజ్రాయెల్‌ తన వైమానిక, సైనిక స్థావరాలపై ఐరన్‌ డోమ్‌ను యాక్టివేట్‌ చేసుకున్నా.. తమ మిస్సైళ్లు ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్ష్యాలను ఛేదించాయని తెలిపారు. యుద్ధాన్ని కొనసాగించాలని, పొడిగించాలని ఇరాన్‌ కోరుకోవడం లేదన్నారు.


ట్రంప్‌ నటుడు.. స్వార్ధ జీవి!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ‘నమ్మలేని నటుడి’గా ఇరాన్‌ రాయబారి ఇలాహీ అభివర్ణించారు. అంతేకాదు.. ఆయనో స్వార్థ జీవి అని వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో అస్థిరతను తగ్గించకపోగా.. ఆయన పెంచేపనిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘‘అమెరికా సహా పశ్చిమ దేశాల సహకారం లేకుండా ఇజ్రాయెల్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇరాన్‌లో పాలకులను మార్చేయాలన్నది అగ్రరాజ్యం దీర్ఘకాల ఆకాంక్ష. కానీ, అది కలగానే మిగిలిపోతుంది.’’ అని ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 25 , 2025 | 06:49 AM