Putin Assures India of Energy Security: భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:28 AM
భారత్‌కు రష్యా నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఇకముందు కూడా కొనసాగుతుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. భారత్‌కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి అవసరమైన అన్నిరకాల ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా.......
అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం
కూడ ంకుళం అణువిద్యుత్ ప్లాంటుకు సహకరిస్తాం
ప్రధాని మోదీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశం
భారత్, రష్యా మధ్య ఐదేళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు
రక్షణ, ఆరోగ్యం, షిప్పింగ్ తదితర 16 ఒప్పందాలు
ఉక్రెయిన్‌తో శాంతియుత ముగింపు.. మోదీ సూచన
భారత్- రష్యా స్నేహం ఒడిదుడుకులను తట్టుకొని ధ్రువతారగా నిలిచిందని వెల్లడి
చర్చల తర్వాత మోదీ-పుతిన్ మీడియా సమావేశం
రాష్ట్రపతి భవన్‌లో విందు.. స్వదేశానికి బయల్దేరిన పుతిన్
న్యూఢిల్లీ, డిసెంబరు 5: భారత్‌కు రష్యా నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఇకముందు కూడా కొనసాగుతుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. భారత్‌కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి అవసరమైన అన్నిరకాల ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో చర్చలు జరిపారు. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఇద్దరు నేతలు రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన సహకారంతోపాటు అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. భారత్-రష్యా బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.
భారత ఉత్పత్తులకు రష్యా మార్కెట్‌ను మరింతగా తెరుస్తామని ఈ సందర్భంగా పుతిన్ ప్రకటించారు. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్లాంటులో నిర్మాణంలో ఉన్న నాలుగు యూనిట్లను త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. 6,000 మెగావాట్ల సామర్థ్యంగల ఈ పవర్ ప్లాంటులో 2013లో ఒకటి, 2016లో మరొక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. ఇంధనేతర అణు సాంకేతికత అభివృద్ధిలో (ఔషధ, వ్యవసాయ రంగాల వంటివి) భారత్‌కు సహకారం అందిస్తామని పుతిన్ తెలిపారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు మోదీ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా పుతిన్‌కు స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో విందులో పాల్గొన్న అనంతరం పుతిన్ స్వదేశానికి తిరిగి వెళ్లారు. ‘‘కలిసి సాగుదాం.. కలిసి ఎదుగుదాం’’ అన్న చెప్తూ ఆయన తన భారత పర్యటనను ముగించారు.
ధ్రువతారగా నిలిచిన స్నేహం
భారత్- రష్యా మధ్య 80 ఏళ్ల స్నేహం కాలపరీక్షకు తట్టుకొని నిలిచిందని మోదీ అన్నారు. ‘గత 8 దశాబ్దాల్లో ప్రపంచం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఎన్నో మానవతా సంక్షోభాలు, సమస్యలు వచ్చాయి. వీటన్నింటినీ తట్టుకొని భారత్-రష్యా స్నేహం ఽధ్రువతారలా స్థిరంగా నిలబడింది. ఈ పునాదిని మరింత బలోపేతం చేసేందుకు మేము అన్ని అంశాలపై చర్చలు జరిపాం. ఆర్థిక సహకారాన్ని మరోస్థాయికి తీసుకెళ్లటమే రెండుదేశాల ఉమ్మడి లక్ష్యం. ఇందుకోసం 2030 వరకు కొనసాగే ఆర్థిక సహకార ప్రణాళికపై సంతకాలు చేశాం. ఈ ప్రణాళిక రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను విస్తృతం చేయటంతోపాటు సుస్థిరం చేస్తుంది’ అని సంయుక్త మీడియా సమావేశంలో మోదీ తెలిపారు. భారత్- రష్యా సంబంధాల్లో ఇంధన భద్రత చాలా కీలకమైందని చెప్పారు. ఈ విషయంలో రెండువైపులా ప్రయోజనం ఉండే విధానాన్ని అవలంభిస్తామని వెల్లడించారు. అరుదైన ఖనిజాల విషయంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం ప్రపంచ సప్లై చైన్‌కు భద్రత కల్పిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు భారత్ సహకారం అందిస్తుందని మోదీ ప్రకటించారు. ‘అంతర్జాతీయ ఘర్షణల విషయంలో భారత్ తటస్థ విధానం అనుసరించబోదు’ అని స్పష్టం చేశారు.
ఐదేళ్ల ఆర్థిక ప్రణాళిక
భారత్-రష్యా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 64 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక సహకార ప్రణాళికపై సంతకాలు చేశారు. డాలర్‌కు బదులుగా సొంత కరెన్సీలోనే లావాదేవీలు నిర్వహించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. భారత్ త్వరలో రష్యా పౌరుల కోసం 30 రోజుల వ్యవధిగల ఉచిత ఈ- టూరిస్ట్ వీసాలను, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాలను జారీచేసేందుకు సమావేశంలో ఒప్పందం కుదిరిగింది. మరోవైపు, భారత్- యూరేషియన్ ఎకనమిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమైనట్లు మోదీ ప్రకటించారు. రష్యాలో 1.2 బిలియన్ డాలర్లతో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ యూరియా ప్లాంటు ఏర్పాటుచేసేందుకు భారత్‌కు చెందిన ఆర్‌సీఎఫ్, ఐపీఎల్, ఎన్‌ఎ్‌ఫఎల్ సంస్థలు సంయుక్తంగా రష్యా కంపెనీ ఉరాల్‌చెమ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
పుతిన్‌తో విందుకు థరూర్ రాహుల్, ఖర్గేలకు అందని ఆహ్వానం
పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేలకు ఆహ్వానం అందలేదు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ అయిన శశిథరూర్‌కు మాత్రం పిలుపువచ్చింది. విదేశాల అధినేతలు భారత్‌కు వచ్చినప్పుడు వారు ప్రతిపక్ష నేతను కలవకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ అనంతరం వివిధ దేశాలకు కేంద్రం పంపిన బృందాల్లో శశిథరూర్ ఉన్న సంగతి తెలిసిందే.
రేంజ్ రోవర్, మెర్సిడె్‌సను కాదని..మోదీ, పుతిన్ ఫార్చునర్‌లో వెళ్లారెందుకు?
ప్రధాని మోదీ అధికారిక వాహనాలైన రేంజ్‌రోవర్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్650 వంటి కార్లు ఓవైపు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక వాహనం ‘ఆరస్ సెనాట్’ లైమోజిన్ కారు మరోవైపు.. అవన్నీ భద్రతాపరంగా ప్రత్యేకంగా రూపుదిద్దినవే. కానీ వాటిని కాదని పుతిన్, మోదీ ఇద్దరూ సాధారణ తెలుపు రంగు టొయోటా ఫార్చునర్ కారులో పాలెం విమానాశ్రయం నుంచి ప్రధాని నివాసానికి వెళ్లారు. దీనివెనుక యూరోపియన్ దేశాలకు పరోక్ష సంకేతం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేంజ్ రోవర్ కారు తయారీ సంస్థ ప్రస్తుతం మన టాటాల చేతుల్లోనే ఉన్నా అది ప్రధానంగా బ్రిటన్‌కు చెందినది. ఇక మెర్సిడెస్ సంస్థ జర్మనీకి చెందినది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆ రెండు దేశాలూ రష్యాపై ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన టొయోటా సంస్థ ఫార్చునర్ వాహనాన్ని ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్, బెలొసోవ్ నేషనల్ వార్ మెమొరియల్ వద్ద నివాళులు అర్పించేందుకు తెలుపు రంగు ఫార్చునర్ కారులోనే కలిసి వెళ్లడం గమనార్హం.
నిజాం కట్టించిన భవనంలో చర్చలు
భారత్-రష్యా వార్షిక సదస్సులో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయి చర్చించిన హైదరాబాద్ హౌస్‌కు ఎంతో చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు.. ఢిల్లీకి వచ్చి వెళ్లినప్పుడు, బ్రిటిష్ అధికారులతో చర్చల కోసం ఓ భవనం అవసరం పడింది. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరున్న నిజాం.. తన వైభవాన్ని తలపించేలా ఉండాలని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ‘హైదరాబాద్ హౌస్’ను కట్టించారు. అప్పటి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటైన్స్ మొఘల్, రోమన్ శైలిలను, ఆధునికతను జోడించి.. సీతాకోకచిలుక ఆకారంలో ఈ భవన సముదాయానికి రూపకల్పన చేశారు. అప్పటి వైస్రాయ్ హౌస్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) తరహాలో పెద్ద డోమ్ ఏర్పాటు చేశారు. మొత్తం 36 గదులు, బర్మా టేకుతో కూడిన విలాసవంతమైన ఫర్నీచర్, పర్షియా కార్పెట్లు, 500 మంది భోజనం చేయగల డైనింగ్ హాల్, విశాలమైన లాన్లు వంటి ఏర్పాట్లెన్నో ఇందులో ఉన్నాయి. అప్పట్లోనే ఈ భవనానికి రూ.50 లక్షలు ఖర్చయింది. అంటే ఇప్పుడు సుమారు రూ.378 కోట్లు.
ఇవి కూడా చదవండి
విద్యార్థులను స్టాన్‌ఫోర్డ్ స్థాయికి తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి