Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 06:26 PM
గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పహల్గాం అమానుష దాడికి పాల్డడిన ముష్కరులను మట్టుబెట్టి, బాధితులకు న్యాయం చేసేందుకు బలగాలు పూర్తి స్థాయిలో దృష్టిసారించాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

శ్రీనగర్: ముంబైలో 2008లో జరిగిన మారణహోమం తరువాత పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద ఘటన భారత్‌ను ఉలిక్కిపడేలా చేసింది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కాస్త ముందుగా నలుగురు సాయుధ ముష్కరులు 26 మంది టూరిస్టులను పహల్గాంలో పొట్టనపెట్టుకోవడంతో సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ మారణహోమానికి కారకులైన ముష్కరులను మట్టుపెట్టేందుకు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. వేలాది మంది సాయుధ పోలీసులు, భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌ను జల్లెడ పడుతున్నారు. పలు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అమానుష దాడికి పాల్డడిన ముష్కరులను మట్టుబెట్టి, బాధితులకు న్యాయం చేసేందుకు బలగాలు పూర్తి స్థాయిలో దృష్టిసారించాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
Pahalgam Terror Attack: సిగ్గుతో తలవంచుకోవాలి.. పహల్గాం దాడిపై జమ్మూకశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసనలు
పహల్గాం దాడులు తప పనేనంటూ అంతగా ప్రాచుర్యంలో లేని కశ్మీర్ రిసెస్టెన్స్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది. 85,000 మందికి పైగా బయటవ్యక్తులు (ఔట్ సైడర్స్) కశ్మీర్ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకోవడం ద్వారా డెమోగ్రాఫిక్ మార్పులు చోటుచేసుకుంటున్నాయని మిలిటెండ్ గ్రూప్ సామాజిక మాధ్యమాల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారంనాడు తాము ఎవరిపై దాడి చేశామో ఆ టూరిస్టులు సాధారణ టూరిస్టులు కాదని, భారత భద్రతా ఏజెన్సీలతో ముడిపడిన వ్యక్తులని పేర్కొంది.
పర్యటన అర్థాంతరంగా ముగించుకుని..
కాగా, పహల్గాం మారణహోమానికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ వదలిపెట్టే ప్రసక్తి లేదని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరకంగా ముగించుకుని బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం వద్దే జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యాయి. బుధవారం సాయంత్రం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీతో కూడా మోదీ సమావేశం కానున్నారు.
వెనక్కి మళ్లుతున్న టూరిస్టులు
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం పలువురు పర్యాటకులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడుపుతున్నారు. పలువురు పర్యాటకులు శ్రీనగర్‌లో హోటళ్లను ఖాళీ చేసి టాక్సీల్లో వెళ్లిపోతున్న దృశ్యాలు స్థానిక టీవీల్లో ప్రసారమవుతున్నాయి. ''ఇలాంటి పరిస్థితుల్లో మా పర్యటనను ఎలా కొనసాగించగలం?'' అని ఢిల్లీ నుంచి వచ్చిన పర్యాటకుడు సమీర్ భరద్వాజ్ ప్రశ్నించారు. ఉద్రిక్తతల మధ్య ప్రయాణం కొనసాగించలేమని, వ్యక్తిగత భద్రతకు తాము ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు.
జీవనోపాధిపై ప్రభావం..ఆటోడ్రైవర్లు ఆవేదన
ఉగ్రవాదుల దాడి తమ జీవనోపాథిపై ప్రభావం చూపుతుందని, అయితే దానికంటే కూడా ప్రజల విలువైన ప్రాణాల గురించే తాము ఎక్కువగా ఆలోచిస్తున్నామని హహల్గాం ఆటో డ్రైవర్ గుల్జార్ అహ్మద్ తెలిపారు.ఈ దాడి వల్ల టూరిజం పరిశ్రమపై మచ్చ పడిందని ఆయన వాపోయారు. ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులను తీవ్రంగా శిక్షంగా చేయాలని, అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడేందుకు ఎవరూ సాహసం చేయరని అన్నారు.
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండ
కాగా, పహల్గాం ఉగ్రదాడిని అత్యంత పాశవిక దాడిగా నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఆమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ దాడిని సామాజిక మాధ్యమవంలో తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఇటలీ ప్రధాని మెలోని సైతం పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. అమాయక ప్రజానీకంపై ఉగ్రదాడులు ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గాం ఘటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మా అతిథులు లోయను (కశ్మీర్) విడిచిపెట్టి వెళ్తుండటంతో హృదయం బరువెక్కిపోయిందని, అయితే ఇదే సమయంలో వాళ్లు ఎందుకు వెళ్లిపోతున్నారో అర్థం చేసుకోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులు సురక్షితంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ యంత్రాగానికి ఆదేశాలిచ్చామని చెప్పారు.
మరోవైపు, ఉగ్రదాడులకు పాల్పడిన వారి వెనుక ఎవరున్నారనేది అధికారికంగా ఇంకా ధ్రువీకరణ కానప్పటికీ పాక్ తీవ్రవాద గ్రూపులే ఈ అమానుషానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, పహల్గాం దాడిలో పలువురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంపై పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ ఖాన్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..