Shukla to ISS: ఐఎస్‌ఎస్‌కి భారత వ్యోమగామి
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:13 AM
భారత వాయుసేన పైలట్ శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కి ప్రయాణించనున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి రెండు వారాలపాటు అక్కడ ప్రయోగాలు నిర్వహించనున్నారు

వచ్చే నెలలో వెళ్లనున్న వాయుసేన పైలట్ శుభాన్షు శుక్లా
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురితో కలిసి..
రెండు వారాలపాటు అక్కడే
పలు ప్రయోగాల నిర్వహణ
రాకేశ్‌శర్మ తర్వాత ఓ భారతీయుడు రోదసిలోకి వెళ్లడం ఇదే తొలిసారి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారత వాయుసేన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా.. వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి వెళ్లనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) ప్రాజెక్టులను శుక్రవారం ఇక్కడ సమీక్షించిన కేంద్ర మంత్రి జితేంద్రసింగ్.. ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్లా చేయబోయే ఈ ప్రయాణాన్ని ఆయన.. అంతరిక్ష అన్వేషణల నవశకంలోకి భారత్ ధైర్యంగా వేస్తున్న అడుగులకు సంకేతంగా, అంతర్జాతీయ అంతరిక్ష భాగస్వామ్యాల విస్తరణలో ఇండియాఅధిగమిస్తున్న కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాలు, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులు.. స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న భారతదేశ చిత్తశుద్ధిని ప్రతిఫలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, శుక్లా ఐఎ్‌సఎ్‌సకు వెళ్లేది ఇస్రో చేపట్టిన మిషన్‌లో భాగంగా కాదు. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టిన ‘యాక్సియం 4’ మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు విదేశీ వ్యోమగాములతో కలిసి ఆయన వెళ్లనున్నారు. అమెరికన్ వ్యాపారదిగ్గజం ఈలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూడ్రాగన్ వారిని ఐఎ్‌సఎ్‌సకు చేరవేయనుంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూడ్రాగన్‌ను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అమెరికన్ వ్యోమగామి, నాసాకు చెందిన పెగ్గీ వాట్సన్ కమాండర్‌గా ఉండే ఈ మిషన్‌లో.. శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తారు. వీరితోపాటు.. పోలండ్‌కు చెందిన స్వావోష్ ఊజ్‌నైన్‌స్కీ, హంగరీకి చెందిన టైబోర్ కాఫూ వెళ్లనున్నారు.
ఆయా దేశాల నుంచి రోదసిలోకి వెళ్లనున్న తొలి వ్యోమగాములు వారే కావడం విశేషం. అలాగే.. రోదసి నుంచి భారతదేశం ఎలా కనపడుతోందని అడిగితే.. ‘సారే జహాఁసే అచ్ఛా’ అంటూ తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జవాబిచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత.. మరో భారతీయుడు అంతరిక్షంలోకివెళ్లడం ఇదే తొలిసారి!! ఈ మిషన్‌లో భాగంగా వారు రెండువారాలపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. శుక్లా ఈ రెండువారాలూ అక్కడ పలు ప్రయోగాలు చేయనున్నారు.
శుక్లా నేపథ్యం..
శుబాన్షు శుక్లా 1985లో యూపీలోని లఖ్‌నవూలో జన్మించారు. 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ వింగ్‌లో చేరారు. ఎస్‌యు-30 ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-32 సహా పలు రకాల విమానాలను 2000 గంటలపాటు నడిపి అపార అనుభవాన్ని గడించారు. 2024 నాటికి గ్రూప్‌కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, పతకాలు సాధించిన శుక్లాకు 2019లో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది. దరిమిలా ఆయన మాస్కో(రష్యా)లోని యూరీ గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో వ్యోమగామి శిక్షణ పొందారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఆయన్ను వ్యోమగామిగా ఎంపిక చేసినట్టు ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 27న ప్రకటించారు.2024లోనే.. యాక్సియం 4 మిషన్‌కు ప్రధాన వ్యోమగామిగా శుక్లా ఎంపికయ్యారు. ఈ మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం వల్ల.. స్పేస్‌ఫ్లైట్ ఆపరేషన్స్, లాంచ్ ప్రోటోకాల్స్ వంటివాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభిస్తుంది. గగన్‌యాన్ మిషన్‌లో ఈ అనుభవాలు ఆయనకు ఎంతగానో ఉపకరిస్తాయి.