Share News

C-295 Airbus: చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

ABN , Publish Date - Aug 03 , 2025 | 07:00 PM

స్పెయిన్‌లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్‌లో అందుకున్నారు. స్పెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది.

C-295 Airbus: చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
C-295 Airbus

న్యూఢిల్లీ: స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ రూపొందించిన సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానం (C-295 military transport aircraft) భారత్‌కు చేరింది. ఒప్పందంలో భాగంగా ఎయిర్ బస్ 2025 నాటికి 16 విమానాలను భారత్‌కు డెలివరీ చేయాల్సి ఉండగా.. చివరిదైన 16వ విమానం శనివారం నాడు భారత్‌ అందుకుంది. భారత రక్షణ సామార్థ్యాన్ని పటిష్టం చేసే కీలక మైలురాయిగా దీనిని స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఒప్పందంలో భాగంగా తక్కిన 40 విమానాల అమరిక, తయారీ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL)లో జరుగుతుంది.


స్పెయిన్‌లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్‌లో అందుకున్నారు. స్పెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది. షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే ఈ డెలివరీ జరిగిందని, భారత రక్షణ సామర్థ్యాల పటిష్టతలో ఇదొక మైలురాయి అని తెలిపింది.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 56 సీ-295 ఎండబ్ల్యూ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్టుల కొనుగోలుకు భారత్ 2021 సెప్టెంబర్‌లో సంతకాలు చేసింది. ఇందుకోసం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, స్పెయిన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 56 విమానాల్లో 16 విమానాలను స్పెయిన్ నుంచి ఎయిర్ బస్ నేరుగా భారత్‌కు డెలివరీ చేస్తుంది. తక్కిన 40 విమానాలు ఇండియాలో తయారవుతాయి. ఆ క్రమంలోనే చివరిదైన 16వ విమానం శనివారం నాడు భారత్‌ అందుకుంది.


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్పానిస్ ప్రధాని పెడ్రో సాంఛెంజ్‌లు గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని వడోదరలో '295 విమానాల' తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాల కిందటి ఆవ్రో-748 విమానాల స్థానంలో సీ-295 విమానాలను ప్రవేశపెట్టనున్నారు. 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్ల సామర్థ్యం కలిగిన ఈ విమానాలు.. 71 మంది సైనికులను కానీ 50 మంది పారాట్రూపర్లను కానీ వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను కూడా నిర్వహించగలదు.


ఇవి కూడా చదవండి..

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే ప్రశ్నకు శశిథరూర్ ఏంచెప్పారంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 07:50 PM