Indian Hypersonic Missile: భారత్ అమ్ములపొదిలో కొత్త బ్రహ్మాస్త్రం.. కే 6 క్షిపణి
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:15 AM
దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులపై దృష్టి సారించిన భారత్.. కే-6 పేరుతో ఒక క్షిపణిని అభివృద్ధి చేస్తోంది.

జలాంతర్గామి నుంచి ప్రయోగించగలిగే న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైల్
రేంజ్.. 12 వేల కిలోమీటర్ల దాకా!
హైదరాబాద్‌లోని ఏఎన్‌ఎస్‌ఎల్‌లో అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీవో
గంటకు 9,200 కిలోమీటర్ల వేగం
ఈ క్షిపణిని మోసే ఎస్-5 స్ట్రాటజిక్ సబ్‌మెరైన్‌ను తయారుచేస్తున్న శాస్త్రజ్ఞులు
న్యూఢిల్లీ, జూలై 20: దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులపై దృష్టి సారించిన భారత్.. కే-6 పేరుతో ఒక క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. దాని రేంజ్ 8 వేల కిలోమీటర్లని చెబుతున్నారు. వాస్తవానికి అది 12 వేల కిలోమీటర్ల దాకా ఉంటుందని సమాచారం. ఇది సబ్‌మెరైన్ లాంచ్‌డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిస్సైల్ (ఎస్‌ఎల్‌బీఎం). అంటే.. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల ఖండాంతర క్షిపణి. చైనా నౌకా దళం హిందూ మహా సముద్రంలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన జేఎల్-3 ఎస్‌ఎల్‌బీఎంకు దీటుగా కే-6 ఎస్‌ఎల్‌బీఎంను మన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని ‘అడ్వాన్స్‌డ్ నేవల్ సిస్టమ్స్ లేబొరేటరీ’లో అభివృద్ధి చేస్తున్నారు. దేశ క్షిపణి కార్యక్రమ పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం తయారుచేస్తున్న ‘కె’ శ్రేణి క్షిపణుల్లో ఈ కే-6 అత్యంత అధునాతనమైనది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణులు.. మన దేశ ‘సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ’ (ఎవరైనా తనపై అణ్వాయుధాన్ని ప్రయోగించినా.. సబ్‌మెరైన్ బేస్డ్ క్షిపణులతో వాటిపై అణు ప్రతిదాడులు చేసే శక్తి)కి అత్యంత కీలకం.
మూడంచెల క్షిపణి..
కే-6 ఎస్‌ఎల్‌బీఎం.. ఘన ఇంధనంతో పనిచేసే మూడంచెల క్షిపణి (ఇంధన వినియోగంలో నష్టాన్ని తగ్గించడానికి, క్షిపణి బరువు తగ్గించడానికి, ఎక్కువ దూరాలను అధిగమించడానికి ఇలా మూడంచెల క్షిపణులను వాడతారు. మన వద్ద ఉన్న అగ్ని-4 రెండంచెల ఘన ఇంధన క్షిపణి). దాదాపు 39 అడుగుల పొడుగు, ఆరున్నర అడుగుల వెడల్పుతో ఉండే ఈ క్షిపణులు 2 నుంచి 3 టన్నుల దాకా పేలోడ్‌ను మోసుకెళ్లగలవు. వీటి రేంజ్ చాలా ఎక్కువ కావడంతో.. భారత జలాల్లోంచి ప్రయోగిస్తే చైనాలో మారుమూల ప్రాంతాలకు, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల దాకా వెళ్లగలవు. ఇవి శబ్దం కన్నా 7.5 రెట్ల వేగాన్ని అందుకోగల హైపర్ సానిక్ క్షిపణులు. వేగం.. గంటకు దాదాపు 9,200 కిలోమీటర్లు. అంత వేగంతో దూసుకొచ్చే ఈ క్షిపణులను గుర్తించి, అడ్డుకోవడం శత్రు దేశ రక్షణ వ్యవస్థలకు చాలా చాలా కష్టం. వీటికి ఎంఐఆర్‌వీ (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్) సామర్థ్యం ఉంటుంది. అంటే.. ఒకే క్షిపణి నుంచి ఒకటి కన్నా ఎక్కువ అణు వార్‌హెడ్లు బయటకు వచ్చి, వేర్వేరు లక్ష్యాలపై దాడి చేయగలవు. అణ్వాయుధాలనే కాదు.. దీని ద్వారా సంప్రదాయ పేలుడుపదార్థాలను కూడా ప్రయోగించవచ్చు. అయితే.. ఈ క్షిపణుల బరువును మోయగలిగే స్థాయి ప్రస్తుతం మన వద్ద ఉన్న జలాంతర్గాములకు లేదు. మన వద్ద ఉన్న అరిహంత్, అరిఘాత్ దీన్ని మోయలేవు. ఈ శ్రేణిలో మూడో జలాంతర్గామి.. అరిదమన్ ఇంకా సీ ట్రయల్స్ దశలో ఉంది. ఇవి కాకుండా.. న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గామి ఎస్4ూను (నాలుగో సబ్‌మెరైన్) భారత నౌకాదళం 2024 అక్టోబరులో జలప్రవేశం చేయించింది. ఆ జలాంతర్గామి ద్వారా.. 3500 కిలోమీటర్ల రేంజ్ గల కలాం-4 (కే-4) మిస్సైల్‌ను ప్రయోగించవచ్చు (దాని తదుపరి తరమైన కె-5 శ్రేణి క్షిపణుల రేంజ్.. దాదాపు 5000 కిలోమీటర్లు). ఇప్పుడు తయారుచేస్తున్న కే-6 క్షిపణులను మోసుకెళ్లే జలాంతర్గాములు లేకపోవడంతో.. ఎస్-5 శ్రేణి స్ట్రాటజిక్ సబ్‌మెరైన్లను కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు సమీపంలోని తయారీ కేంద్రంలో నిర్మిస్తున్నారు. ఈ ఎస్-5 జలాంతర్గాముల బరువు 13 వేల టన్నులు (డిస్‌ప్లే్‌సమెంట్). ఒక్కో ఎస్-5 జలాంతర్గామీ 12 నుంచి 16 దాకా కే-6 క్షిపణులను మోసుకెళ్లగలదు. శత్రువుల సోనార్ వ్యవస్థలకు చిక్కకుండా ఈ జలాంతర్గామిపై పూసేందుకు ‘మిశ్ర ధాతు నిగమ్’ ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News