Share News

PM Narendra Modi Maldives Visit: 4,850 కోట్లు..మాల్దీవులకు రుణ సాయం

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:58 AM

మాల్దీవులకు రూ. 4,850 కోట్ల రుణ సాయం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

PM Narendra Modi Maldives Visit: 4,850 కోట్లు..మాల్దీవులకు రుణ సాయం

  • ఆ దేశ పర్యటనలో ప్రకటించిన మోదీ

  • ప్రధానికి ఘన స్వాగతం పలికిన ముయిజ్జు

  • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు

మాలె, జూలై 25: మాల్దీవులకు రూ. 4,850 కోట్ల రుణ సాయం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ దేశానికి భారత్‌ నమ్మకమైన మిత్రుడని పేర్కొన్నారు. శనివారం జరగనున్న మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు మాల్దీవుల రాజధాని మాలెలో శుక్రవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మహమద్‌ ముయిజ్జు, పలువురు ఆ దేశ మంత్రులు స్వయంగా మాలెలోని వెలెనా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్‌ స్క్వేర్‌లో సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి సైనిక వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్వయంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, మౌలిక వసతులు వంటి అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పలు కారణాల వల్ల దెబ్బతిన్న తర్వాత తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇరు దేశాలు ఒక ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.


అంతేగాక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపైనా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం, మహాసాగర్‌(మ్యూచువల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఎక్రాస్‌ రీజియన్స్‌) అనే భారత విధానంలో మాల్దీవులకు ప్రధాన పాత్ర ఉందని పేర్కొన్నారు. రక్షణ, భద్రత అంశాల్లో సహకారం పరస్పర విశ్వాసానికి కీలకం అన్నారు. మాల్దీవుల రక్షణ రంగం బలోపేతానికి భారత్‌ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. ‘అధ్యక్షుడు ముయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడం నా హృదయానికి హత్తుకుంది.. రానున్నకాలంలో ఇరు దేశాల సంబంధాలు ఎంతో ఉన్నత స్థాయికి చేరతాయి’ అని మోదీ ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌లో విశ్వాసం వ్యక్తంచేశారు. కాగా ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనతో ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో సానుకూల మార్పు వస్తుందని విశ్లేషకుల అంచనా. మాల్దీవుల్లో ఏకీకృత చెల్లింపుల విధానం(యూపీఐ)ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. కాగా మాల్దీవులపై చైనా పట్టును సడలింపజేసి హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఆ దేశ ఆధిపత్యం లేకుండా చూడాలని భారత్‌ ఆశిస్తోంది.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 02:58 AM