Nuclear Tests: రహస్య అణు పరీక్షలు పాక్‌కు కొత్తకాదు... స్పందించిన భారత్
ABN , Publish Date - Nov 07 , 2025 | 07:03 PM
రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణ్వాయుధ కార్యక్రమాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ రణ్‌దీర్ జైశ్వాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ చురుకుగా అణుపరీక్షలు జరుపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. దీనిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణ్వాయుధ కార్యక్రమాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir) శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
'అక్రమంగా అణు కార్యక్రమాలు, స్మగ్లింగ్, ఎగుమతుల నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏకే ఖాన్ నెట్‌వర్క్ వంటివి పాక్‌కు దశాబ్దాలుగా అలవాటే. ఈ కోణాల్లో పాక్ రికార్డును అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ ఎల్లప్పుడూ తీసుకు వెళ్తూనే ఉంది. పాక్ అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను నిశితంగా పరిశీలిస్తున్నాం' అని జైశ్వాల్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటపై అడిగినప్పుడు ప్రస్తుతం దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని జైశ్వాల్ తెలిపారు. తనకు తెలిసినప్పుడు ఆ సమాచారం పంచుకుంటామని చెప్పారు. రష్యా ఆర్మీలో ఇండియన్లను రిక్రూట్ చేయడంపై మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా ఇందుకు సంబంధించిన సమాచారం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వారిని సాధ్యమైనంత త్వరలో రిలీజ్ చేయాలని మాస్కో అధికారులతో ఎంఈఏ సంప్రదిస్తోందని చెప్పారు. ఈ తరహా రిక్రూట్ పద్ధతి మంచిది కాదన్నారు. ఈ ప్రాక్టీస్‌కు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని భారత్ కోరుకుంటోందన్నారు.
అణుపరీక్షలపై ట్రంప్ ఏమన్నారంటే..
ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తాము అణుపరీక్షలు జోలికి వెళ్లలేదని, ఇప్పుడు తాము కూడా అణు పరీక్షలు జరుపుతామని అన్నారు.
ఇవి కూడా చదవండి..
వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల
బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి