IIM Kolkata Student: కౌన్సెలింగ్ అని పిలిచి.. డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:12 AM
పశ్చిమ బెంగాల్‌లో న్యాయ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే..

ఐఐఎం కోల్‌కతా విద్యార్థినిపై సహచర విద్యార్థి అఘాయిత్యం.. నిందితుడికి రిమాండ్
రేప్ జరగలేదన్న బాధితురాలి తండ్రి
కోల్‌కతా, జూలై 12: పశ్చిమ బెంగాల్‌లో న్యాయ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే.. తాజాగా మరో విద్యార్థిని అఘాయిత్యానికి గురైంది. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై.. సహచర విద్యార్థే అత్యాచారానికి పాల్పడ్డాడు. కౌన్సెలింగ్ ఇస్తానని ఆమెను క్యాంపస్ బాయ్స్ హాస్టల్‌కు రప్పించుకున్న అతడు.. డ్రగ్స్ కలిపిన శీతల పానీయం ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడితో ఆమెకు ముందు నుంచే పరిచయముంది. కౌన్సెలింగ్ సెషన్ అని చెప్పి శుక్రవారం ఆమెను క్యాంపస్ బాయ్స్ హాస్టల్‌కు ఆహ్వానించడంతో నమ్మి అక్కడికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కలిపిన శీతల పానీయం, పిజ్జా ఇవ్వడంతో అవి తీసుకున్న కాసేపటికే ఆమె స్పృహ కోల్పోతున్నట్లు అనిపించి.. తనను రెస్ట్ రూమ్‌కు తీసుకెళ్లాలని కోరింది. అయితే అతడు తనపై దాడి చేసి.. అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మత్తు నుంచి కోలుకునేందుకు సాయంత్రమైందని.. హాస్టల్ గది నుంచి బయటకు వచ్చి మరో విద్యార్థి సాయంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు నిందితుడిని మహావీర్ తోప్పన్నవార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శనివారం అతడిని అలీపోర్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి ఈనెల 19 వరకు రిమాండ్ విధించారు. అయితే తన కూతురిపై అత్యాచారం జరగలేదని బాధితురాలి తండ్రి చెప్పారు. ‘నా కూతురు ఆటో నుంచి కింద పడటంతో స్పృహ కోల్పోయినట్లు ఫోన్ వచ్చింది. పోలీసులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారన్నారు. ఆమెను నేరుగా వెళ్లి కలిశాను. ఎలాంటి లైంగికదాడి జరగలేదని చెప్పింది’ అని వెల్లడించారు.