Yogi Adityanath: బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:58 PM
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంతపాడుతోందని, పశ్చిమబెంగాల్ సీఎం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పుడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

హర్దోయ్: వక్ఫ్ సవరణ చట్టానికి (Waqf Bill) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ని ముర్షీదాబాద్ (Murshidabad) లో హింసాకాండ చోటుచేసుకోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "హింసకు పాల్పడేవారికి మంచిమాటలు చెవికెక్కవు. లాఠీల భాషే వారికి అర్ధమవుతుంది'' అని విమర్శించారు. బంగ్లాదేశ్‌ను అంతగా ప్రేమించే వారు అక్కడికే వెళ్లిపోవచ్చని అన్నారు. హర్దోయ్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను యోగి ఆదిత్యనాథ్ మంగళవారంనాడు ప్రారంభించారు.
బంగ్లాదేశ్‌లో అంశాంతి నెలకొనడంపై యోగి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. వారం రోజులుగా ముర్షీదాబాద్ తగులబడుతోందని, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరూ మౌనంగా చూస్తుండి పోతున్నారని అన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంతపాడుతోందని, పశ్చిమబెంగాల్ సీఎం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు.
బెంగాల్‌లో హిందువుల రక్షణకు కేంద్ర బలగాలను మోహరించాలంటూ ఆదేశించిన బెంగాల్ న్యాయవ్యవస్థకు యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బలగాలు ప్రజల భద్రతకు రంగంలోకి దిగారని చెప్పారు. బెంగాల్ హింసాకాండపై ప్రధాన రాజకయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. "అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. టీఎంసీ సైలెంట్ అయిపోయింది. పైగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనలను సపోర్ట్‌గా మాట్లాడుతుండటం సిగ్గుచేటు'' అని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. బెంగాల్‌లో ఇంత హింస జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడం గర్హనీయమని అన్నారు.
ఇవి కూడా చదవండి..