Rahul Gandhi: పదేళ్లుగా వెంటాడుతున్నారు..మా బావకు నేనున్నా..
ABN , Publish Date - Jul 18 , 2025 | 09:40 PM
రాజకీయ కక్షతో తమ కుటుంబాన్ని బెదిరించలేరని, న్యాయంపై తమకు విశ్వాసం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వాద్రా, ప్రియాంకకు ఉన్నాయని చెప్పారు.

న్యూఢిల్లీ: హర్యానాలో భూముల వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కింద రాబర్ట్ వాద్రా (Robert Vadra)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన ఛార్జిషీటుపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) 'ఎక్స్' వేదికగా ఘాటుగా స్పందించారు. గత పదేళ్లుగా ఈ ప్రభుత్వం తన బావను వెంటాడుతూనే ఉందని, అందులో భాగంగానే తాజాగా ఛార్జిషీటు దాఖలు చేశారని అన్నారు. ఇది దురుద్దేశంతో, రాజకీయ కక్షతో చేసిన పనని విమర్శించారు. ఈ కేసును ఎదుర్కొనేందుకు వాద్రా, ప్రియాంక కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
రాజకీయ కక్షతో తమ కుటుంబాన్ని బెదిరించలేరని, న్యాయవ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని రాహుల్ అన్నారు. 'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వాద్రా, ప్రియాంకకు ఉన్నాయి. నిజం ఎప్పటికైనా నిగ్గు తేలుతుంది' అని ఆయన పేర్కొన్నారు. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ అస్త్రంగా ఈడీని వాడుకుంటున్నారని కాంగ్రెస్ తరచు ఆరోపిస్తూనే ఉందని, తాము ఏదైతో చెబుతున్నామో దానికి కీలకమైన ఎన్నికలకు ముందు మరింత ఆజ్యం పోస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడ్డారు.
క్రిమినల్ మనీలాండరింగ్ కేసులో రాబర్డ్ వాద్రాపై ఈడీ తొలిసారిగా గురువారం నాడు ప్రాసిక్యూషన్ క్లంప్లయింట్ నమోదు చేసింది. శికోహ్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమిని తప్పుడు విధానాల్లో వాద్రా ప్రైవేట్ లిమిట్ సంస్థ స్కై లైట్ హాస్పిటాలిటీ కొనుగోలు చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీని విలువ రూ.7.5 కోట్లుగా పేర్కొంది. నాలుగేళ్ల తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించిందని, ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించింది. వాద్రా, అసోసియేట్లకు చెందిన రాజస్థాన్, హర్యానా, యూపీ, పంజాబ్, గుజరాత్‌లోని రూ.37.64 కోట్లు విలువ చేసే 43 స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఛార్జిషీటులో పేర్కొంది.
నా నిర్దోషిత్వం నిరూపించుకుంటా: వాద్రా
కాగా, ఈడీ ఛార్జిషీటుపై వాద్రా స్పందిస్తూ కోర్టులో తన వైపు వాదనను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను నిర్దోషిననని నిరూపించుకుంటానని చెప్పారు. ఇంతవరకూ తనను ప్రస్తుత ప్రభుత్వం వేధిస్తున్న దానికి కొనసాగింపే ఈ తాజా చర్యని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈడీ చర్యను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది రాజకీయ ప్రత్యర్థులను బయపెట్టేందుకు అధికార ప్రభుత్వం చేస్తున్న దుష్ట ప్రయత్నమని, ఈ ప్రయత్నాలు ఎంతమాత్రం విజయవంతం కావని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఏఐ విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్
చంగూర్ బాబా రెడ్ డైరీలో పలువురు పొలిటీషియన్ల పేర్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి