Religious Scam: బ్రాహ్మణ మహిళను ఇస్లాంలోకి తెస్తే రూ.16 లక్షలు
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:33 AM
పేదలు, నిస్సహాయులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, వితంతవులు, కష్టాల్లో ఉన్న వారు..

సిక్కు, క్షత్రియులైతే 12 లక్షలు, ఓబీసీ అయితే 10లక్షలు
యూపీలో బయటపడ్డ అక్రమ మతమార్పిళ్ల రాకెట్
ఛంగూర్ బాబా, అతని అనుచరుల అరెస్టు
ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్తనని చెప్పుకొన్న ఛంగూర్ బాబా
న్యూఢిల్లీ, జూలై 19: పేదలు, నిస్సహాయులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, వితంతవులు, కష్టాల్లో ఉన్న వారు. మరీ ముఖ్యంగా హిందూ మహిళలు, మైనర్ బాలికలే లక్ష్యం.. ప్రేమ పేరుతోనో, మరో మార్గంలోనో వారికి దగ్గరవ్వడం.. భయపెట్టో, బెదిరించో, బ్రెయిన్ వాష్ చేశో.. ఏదో ఒక మార్గంలో వారిని ఇస్లాంలోకి మారేలా చేయడం.. ఇదీ అక్రమ మతమార్పిళ్ల వ్యవహారంలో అరెస్టయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఛంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా చీకటి దందా. బ్రాహ్మణ మహిళని మతం మారిస్తే ఇంత ? వితంతువు అయితే ఇంత ? అని రేటు పెట్టి తన అనుచరులకు పెద్ద మొత్తంలో డబ్బు ఎరవేసి ఛంగూర్ బాబా వారితో మతమార్పిళ్లు చేయించేవాడు. ఒకప్పుడు సైకిల్‌పై తిరుగుతూ తాయత్తులు అమ్ముకున్న ఛంగూర్ బాబా ఈ అక్రమ మత మార్పిళ్ల దందాతో కోట్లకు పడగలెత్తాడు. అంతేనా, తన దందా గుట్టు బయటపడకూడదని ఆరెస్సెస్ పేరును వాడేశాడు. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖలను కలిసినప్పుడు తానో ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్తనని, నాగ్‌పూర్ కేంద్రంగా ఉన్న భారత్ ప్రతికార్త్ సేవా సంఘ్ అవధ్ విభాగం ప్రధాన కార్యదర్శినని చెప్పుకొనేవాడు.
తన లెటర్‌హెడ్‌లపై ప్రధాని మోదీ ఫొటో కూడా ముద్రించాడు. కాగా, యూపీలోని బలరాంపూర్ జిల్లాలో అక్రమ మతమార్పిళ్ల రాకెట్‌ను ఛేదించిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఛంగూర్ బాబా, అతని అనుచరులను జూలై 6న అరెస్టు చేశారు. మతమార్పిళ్ల కోసం తన అనుచరులకు ఛంగూర్ భారీగా నజరానాలు ఇచ్చినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. బ్రాహ్మణ మహిళలను ఇస్లాం మతంలోకి మారిస్తే రూ.16 లక్షలు, సిక్కు, క్షత్రియ మహిళలను మారిస్తే రూ.12లక్షలు, ఓబీసీ మహిళలను ఇస్లాంలోకి మారిస్తే రూ.10లక్షలు చొప్పున నజరానాలు ఇచ్చేవాడు. ఈ వ్యవహారంపై ఈడీ కూడా దృష్టి సారించింది. ఛంగూర్‌కు ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీయగా ఇస్లామిక్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఛంగూర్ అతని అనుచరులకు అందినట్టు కనుగొన్నారు. 40 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.106 కోట్లు అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. ఒకప్పుడు రెహ్రా మాఫీ అనే గ్రామ సర్పంచ్‌గా పని చేసిన ఛంగూర్.. ఆ గ్రామ శివారులోని దర్గా పక్కన నిబంధనలకు విరుద్ధంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతిని కట్టాడు. అధికారులు దాన్ని కూల్చివేశారు. ఇక, విదేశాల నుంచి అందిన సొమ్ముతో ఛంగూర్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని కూడా నడిపినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News