Himachal Pradesh: హిమాచల్‌లో వరదలకు నీట మునిగిన బ్యాంకు
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:59 AM
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలకు ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. వరద ఉద్ధృతికి బ్యాంకులోని విలువైన వస్తువులన్నీ పాడైపోయి ఉంటాయని..

మండి, జూలై 7: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలకు ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. వరద ఉద్ధృతికి బ్యాంకులోని విలువైన వస్తువులన్నీ పాడైపోయి ఉంటాయని.. శిథిలాలు, బురద తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేయగలుగుతామని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. మండి జిల్లాలోని థునాగ్ పట్టణంలో ఉన్న హిమాచల్ రాష్ట్ర సహకార బ్యాంకులో సమీప పట్టణాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు, ఖాతాదారులు తమ డబ్బును డిపాజిట్ చేస్తుంటారు. నగలు, విలువైన పత్రాలను దాచుకున్నారు.
కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మండి జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలోనే సహకార బ్యాంకు భవనం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా కొంతమంది స్థానికులు బ్యాంకు వద్దే కాపలా ఉండటం గమనార్హం.