Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:55 AM
ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది.

ఏడుగురి దుర్మరణం మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా..
గాల్లోకి ఎగిరిన కాసేపటికే కూలిన వైనం
ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం?
రుద్రప్రయాగ్(ఉత్తరాఖండ్), జూన్ 15: ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు. మృతులు మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. అధికారుల కథనం ప్రకారం.. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన బెల్ 407 హెలికాప్టర్.. ఆరుగురు యాత్రికులు, పైలట్ సహా ఏడుగురితో ఆదివారం ఉదయం 5:10 గంటలకు గుప్తకాశి నుంచి బయలుదేరి 5:18 గంటలకు కేదార్‌నాథ్ చేరుకుంది. అక్కడి నుంచి 5:19 గంటలకు తిరుగు ప్రయాణమైన హెలికాప్టర్ 5:20 నిమిషాలప్పుడు గౌరీకుంద్ సమీపంలోని అడవిలో కూలిపోయింది. దీంతో హెలికాప్టర్‌లో ఉన్న పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్(39), బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ రావత్, మహారాష్ట్రకు చెందిన రాజ్‌కుమార్ జైస్వాల్, శ్రద్ధ దంపతులు వారి కుమార్తె కాశీ(2), ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినూద్ దేవి(66) తుష్తీ సింగ్(19) మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మరణించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ 15 ఏళ్లకు పైగా భారత ఆర్మీలో పని చేశారు.
పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ నడపడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అయితే, కేదార్‌నాథ్ నుంచి తిరుగు ప్రయాణం అప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని, హెలికాప్టర్‌ను దారి మళ్లించేందుకు పైలట్ ప్రయత్నిస్తుండగానే ప్రమాదం జరిగిందని స్థానిక పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవ్వగా.. ఆ తర్వాత ఈ మార్గంలో జరిగిన ఐదో హెలికాప్టర్ ప్రమాదం ఇది. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌ధామ్ మార్గంలో సోమవారం వరకు హెలికాప్టర్ సేవలను నిలిపివేసింది. కాగా, మే 8న గంగోత్రిధామ్ వెళుతున్న ఓ హెలికాప్టర్ ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోగా.. ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మే 12న జరిగిన ఘటనలో సెర్సీ నుంచి బద్రీనాథ్‌కు యాత్రికులతో వస్తున్న ఓ హెలికాప్టర్‌ను ప్రతికూల వాతావరణం వల్ల ఓ పాఠశాల మైదానంలో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మే 17న జరిగిన ఘటనలో రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రి హెలికాప్టర్ అంబులెన్స్.. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ హెలీప్యాడ్ సమీపంలో కూలిపోయింది. జూన్ 7న కేదార్‌నాథ్ వెళుతున్న ఓ హెలికాప్టర్‌ను సాంకేతిక సమస్యల వల్ల రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ఎయిరిండియాకు చెందిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం ఘజియాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ ఐఎక్స్ 1511 విమానంలో ఈ లోపం తలెత్తింది. దీంతో రన్‌వే పైనే గంటసేపు నిలిపివేయాల్సి వచ్చింది. లోపాన్ని సరిచేసి విమానం బయలుదేరేటప్పటికి ఏడు గంటలు ఆలస్యమైంది. విమానం బయలుదేరే ముందు సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించేందుకు గంటల్లో సమయం పట్టింది. దీనిపై ఎయిరిండియా వివరణ ఇచ్చింది. టేకా్‌ఫకు కాసేపు ముందు సాంకేతిక సమస్యను గుర్తించామని, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. వారి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసేందుకైనా, టికెట్ సొమ్మును తిరిగి చెల్లించేందుకుకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.