Mobile Number Verification: యాప్‌ల్లో ఇచ్చే ఫోన్ నంబర్లకు సర్కారీ ధ్రువీకరణ తప్పనిసరి
ABN , Publish Date - Jun 30 , 2025 | 06:12 AM
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు.. టెలీకమ్యూనికేషన్ విభాగం డీవోటీ కొత్త సైబర్ భద్రత నియమాలను ప్రతిపాదించింది. డిజిటల్ ప్లాట్‌ఫారాల ద్వారా వినియోగదారులు ఇచ్చే మొబైల్ నంబర్లు నిజంగా వారివేనా కాదా అనే విషయాన్ని యాప్‌లు, బ్యాంకులు ధ్రువీకరించుకునేందుకు..

అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫామ్
టెలీకమ్యూనికేషన్స్ విభాగం ప్రతిపాదన
ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం
సుప్రీం తీర్పునకు విఘాతమన్న ఆందోళన
గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం
న్యూఢిల్లీ, జూన్ 29: ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు.. టెలీకమ్యూనికేషన్ విభాగం (డీవోటీ) కొత్త సైబర్ భద్రత నియమాలను ప్రతిపాదించింది. డిజిటల్ ప్లాట్‌ఫారాల ద్వారా వినియోగదారులు ఇచ్చే మొబైల్ నంబర్లు నిజంగా వారివేనా కాదా అనే విషయాన్ని యాప్‌లు, బ్యాంకులు ధ్రువీకరించుకునేందుకు.. ఒక ప్లాట్‌ఫామ్‌ను (నూతన ధ్రువీకరణ వ్యవస్థను) ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రచురించిన ముసాయిదాలో పేర్కొంది. సాధారణంగా మనం క్యాబ్ బుక్ చేసుకోవడానికో, ఆహారం ఆర్డర్ చేయడానికో, సరుకులు కొనుగోలు చేయడానికో రకరకాల యాప్‌లు వాడుతుంటాం. ఆ యాప్‌లను మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మన ఫోన్ నంబర్ ఇస్తాం. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఆయా యాప్‌లు మనం ఇచ్చిన నంబర్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) పంపుతాయి. దాన్ని మనం ఎంటర్ చేస్తే ఫోన్ నంబర్ ధ్రువీకరణ పూర్తవుతుంది. కానీ, టెలికం డిపార్ట్‌మెంట్ కొత్తగా చేసిన ప్రతిపాదన ప్రకారం ఇకపై యాప్‌లు, బ్యాంకులు సహా ఇతర డిజిటల్ వేదికలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే వ్యవస్థ ద్వారానే వినియోగదారుల మొబైల్ నంబర్లను వైరిఫై (ఎంఎన్‌వీ) చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల యాప్‌లైతే ఈ ధ్రువీకరణను ఉచితంగా చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసే ధ్రువీకరణ అయితే.. ఒక్కో ఫోన్ నంబర్ ధ్రువీకరణకూ రూపాయిన్నర, ప్రైవేటు సంస్థలు తమ కోసం చేసుకునే ద్రువీకరణ అయితే ఒక్కో నంబర్‌కూ రూ.3 చొప్పున చెల్లించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. అయితే.. ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మొబైల్ నంబర్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలన్న డీవోటీ ప్రతిపాదన పట్ల కొందరు నిపుణులు వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రజల వ్యక్తిగతగోప్యతకు భంగం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలు నంబర్ల ధ్రువీకరణతోనే ఆగుతాయా? లేక వినియోగదారుల ఇతర వివరాలు కూడా సేకరిస్తాయా? ఒకవేళ సేకరిస్తే ఏయే వివరాలు?.. అనే సందేహాలకు ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానం లేదని వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాదు.. ఎంఎన్‌వీ చార్జీల పేరిట వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే పౌరుల ఫోన్ నంబర్లతో కూడిన డేటాబే్‌సను నిర్వహించాల్సి ఉంటుందని (డేటా సెంట్రలైజేషన్).. అంతేకాక, ఈ నిర్ణయం వ్యక్తిగత గోప్యతకు సంబంధించి జస్టిస్ పుట్టస్వామి కేసులో సుప్రీం కోర్టు పేర్కొన్న ‘ప్రపోర్షనాలిటీ’ (చిన్న ప్రయోజనాల కోసం పెద్ద హక్కులకు భంగం వాటిల్లడం) నిబంధనకు విఘాతం కలిగించేలా ఉందని ‘ద డైలాగ్’ అనే టెక్ పాలసీ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుడు కాజిమ్ రిజ్వీ ఆందోళన వెలిబుచ్చారు. డీవోటీ ప్రతిపాదిస్తున్న ఎంఎన్‌వీ ఇందుకు సరైన ఉదాహరణ. ప్రైవేటు సంస్థల కోసం ఆధార్ వెరిఫికేషన్‌ను ఉపయోగించడం చిన్న ప్రయోజనమైతే.. దానివల్ల పౌరుల వ్యక్తిగత గోప్యత అనే పెద్ద హక్కుకు విఘాతం కలుగుతుందని.. ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమేనని కాజిమ్ రిజ్వీ వంటివారి వాదన. అంతేకాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, పాన్ కార్డు పొందేందుకు, ఐటీ రిటర్నుల సమర్పణకు మాత్రమే ఆధార్ తప్పనిసరి అని.. ప్రైవేటు సంస్థలకు ‘ఆధార్’ ఆధారిత సేవలు అందించడం చట్టబద్ధం కాదని సుప్రీం కోర్టు అప్పట్లో తన తీర్పులో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ నేపథ్యం..
భారత్‌లో 116 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా కూడా ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఆధారిత మోసాలకు సైబర్ నేరగాళ్లకు ఇండియా టార్గెట్‌గా ఉంది. దొంగిలించిన లేదా పొగొట్టుకున్న సిమ్ కార్డుల ద్వారా కాల్స్, చేసి వ్యక్తిగత సమాచారాలు రాబట్టడం, డిజిటల్ అరెస్టుల వంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2022తో పోలిస్తే 2024 నాటికి డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ మోసాల సంఖ్య మూడింతలు పెరిగింది. ప్రజలు పోగొట్టుకున్న సొమ్ము 2022తో పోలిస్తే 2024 నాటికి 21 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే డీవోటీ ఈ ప్రతిపాదన చేసింది. అలాగే.. వినియోగంలో ఉన్న ఐఎంఈఐ నంబర్లను కొత్త డివైజ్‌లకు ఉపయోగించకుండా తయారీదారులు చూసుకోవాల్సి ఉంటుందని డీవోటీ తన ముసాయిదాలో పేర్కొంది. ట్యాంపర్ లేదా బ్లాక్‌లిస్టు చేసిన ఐఎంఈఐల డేటాబేస్ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మకందారులు సేల్‌కు ముందు ఒక ఐఎంఈఐ చెకింగ్‌కు రూ.10 చెల్లించి ఈ డేటాబే్‌సను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.