Medical Scam: సెంట్రల్ మెడికల్ స్కామ్‌లో గాడ్‌మెన్, యూజీసీ మాజీ చీఫ్
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:18 PM
పలు రాష్ట్రాలకు ఈ స్కామ్‌లో సంబంధం ఉండటంతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యవర్తులు, ప్రైవేటు కాలేజీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, ఒక స్వయం ప్రకటిత గాడ్‌మెన్ ప్రమేయం ఉన్నట్టు సీబీఐ తెలిపింది.

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వైద్యవిద్య కుంభకోణాన్ని (Medical Education Scam) సీబీఐ (CBI) వెలికితీసింది. పలు రాష్ట్రాలకు ఈ స్కామ్‌లో సంబంధం ఉండటంతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC), మధ్యవర్తులు, ప్రైవేటు కాలేజీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, ఒక స్వయం ప్రకటిత గాడ్‌మెన్ ప్రమేయం ఉన్నట్టు సీబీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి 34 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఎనిమిది మంది అధికారులు ఆరోగ్య శాఖకు చెందిన వారు ఉండగా, ఒకరు ఎన్‌హెచ్ఏకు చెందిన వారు, ఎన్ఎంసీ తనిఖీ బృందాల్లో పాలుపంచుకున్న ఐదుగురు వైద్యులు ఉన్నారు.
సిబీఐ స్కానర్‌లో..
విచారణలో భాగంగా సీబీఐ స్కానర్‌లో చిక్కుకున్న ప్రముఖులు వీరే..
-డీపీ సింగ్: యూజీసీ మాజీ చైర్మన్, ప్రస్తుత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) చైర్మన్.
-రవి శంకర్ మహరాజ్: స్వయం ప్రకటిత గాడ్‌మెన్. ఈయనను రావత్‌పుర సర్కార్ అని కూడా పిలుస్తారు. రావత్‌పుర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చైర్మన్.
-సురేష్ సింగ్ భదౌరియా: ఇండోర్‌లోని ఇండెక్స్ మెడికల్ కాలేజీ చైర్మన్
-మయూర్ రావల్: గీతాంజలి యూనివర్శిటీ రిజిస్ట్రార్
ఈ నలుగురికి అధికారులకు లంచాలు ఇవ్వడం, తనిఖీలను తారుమారు చేయడంలో ప్రమేయం ఉందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
ఇంతవరకూ ఎనిమిది మంది అరెస్టు
ఈ కేసులో ముగ్గురు ఎన్ఎంసీ డాక్టర్లతో పాటు ఎనిమిది మందిని సీబీఐ ఇంతవరకూ అరెస్టు చేసింది. నయ రాయిపూర్‌లోని రావత్‌పుర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అనుకూలంగా తనిఖీ నివేదికలు అందించేందుకు రూ.55 లక్షలు లంచం తీసుకున్నారన్నది వీరిపై అభియోగం. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఇన్‌స్పెక్షన్‌కు సంబంధించి రవిశంకర్ ముందస్తు సమాచారం కోరారు. రావత్‌పుర ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అతుల్ కుమార్ తివారీ ఈ సమాచారాన్ని మయూర్ రావల్ నుంచి సేకరించారు. తనిఖీ తేదీలు, మూల్యాంకకుల (అస్సెసర్స్) పేర్లను పంచుకునేందుకు రావల్ రూ .25-30 లక్షలు డిమాండ్ చేశారు. అనుకూలమైన నివేదిక కోసం డీపీ సింగ్‌ను కూడా రవిశంకర్ సంప్రదించారు. ఈ పనిని సురేష్‌కు సింగ్ అప్పగించారు. దీనిపై సింగ్‌ను సీబీఐ సంప్రదించినప్పటికీ ఇప్పటి వరకూ సింగ్ స్పందించలేదు.
ఆరోగ్య శాఖలోని ఎనిమిది మంది అధికారులు భారీ ముడుపులు తీసుకుని కీలకమైన ఫైళ్లను మధ్యవర్తులు, కాలేజీ ప్రతినిధులతో పంచుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇంటర్నల్ నోటింగ్స్‌ను అధికారులు ఫోటోలు తీసి, మధ్యవర్తుల ద్వారా వీటిని షేర్ చేశారు. ఈ చర్యకు పాల్పడిన ఆరోగ్య శాఖలోని అధికారులను పూనమ్ మీనా, ధరమ్‌వీర్, పీయూష్ మల్యాన్, అనూప్ జైశ్వాల్, రాహుల్ శ్రీవాత్సవ, దీపక్, మనీషా, చందన్ కుమార్‌గా సీబీఐ గుర్తించింది. లీకైన సమాచారంతో మెడికల్ కాలేజీలు ముందుగానే ఇన్‌స్పెక్షన్లకు రెడీ కావడం, మూల్యాంకకులకు ముడుపులు చెల్లించడం, గోస్ట్ ఫ్యాకల్టీని ఉపయోగించడం, ఫేక్ పేషెంట్లను అడ్మిట్ చేయడం, బయోమెట్రిక్ టాంపరింగ్‌కు పాల్పడ్డాయి.
ఎన్ఎంసీ టీమ్‌లు, మధ్యవర్తులు, ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతినిధుల మధ్య కోట్లాది రూపాయలు చేతులు మారాయని, హవాలా మార్గాల్లో ఈ లావాదేవీలు సాగాయని సీబీఐ గుర్తించింది. పలు రాష్ట్రాల్లోనూ ఈ స్కామ్ వేళ్లూనుకున్నట్టు దర్యాప్తు సంస్థ చెబుతోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. అనంతపురంలో హరి ప్రసాద్ పలు కాలేజీలకు ఫిక్సర్‌గా పనిచేశారు. ఎన్ఎంసీ తనిఖీలకు డమ్మీ ఫ్యాకల్టీలను ఏర్పాటు చేశారు. హరిప్రసాద్ భాగస్వాములు కృష్ణ కిషోర్, అంకం రాంబాబులు దక్షిణాది కాలేజీ డైరెక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని సీబీఐ చెబుతోంది. విశాఖపట్నంలోని మెడికల్ కాలేజీ వెంకట్ నుంచి, వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ ఫాదర్ జోసెష్ కొమ్మారెడ్డి నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ ఎమోషనల్ స్పీచ్.. ఈ కుర్చీ ప్రత్యేకత ఇదే!
ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి