రూ.50 కోట్ల చక్కెర నీటి పాలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:41 AM
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర మిల్లు.. దాని పక్కనే మున్సిపల్ డ్రైనేజీ కాలువ. కాలువ పక్కన స్థలం ఆక్రమణకు పాల్పడటంతో అర్థరాత్రి కురిసిన వర్షంతో డ్రైనేజీ ఉప్పొంగి..

హరియాణలో భారీ వర్షాలు
షుగర్ మిల్లులోకి వరద నీరు
కొట్టుకుపోయిన పంచదార నిల్వలు
న్యూఢిల్లీ, జూలై 1: ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర మిల్లు.. దాని పక్కనే మున్సిపల్ డ్రైనేజీ కాలువ. కాలువ పక్కన స్థలం ఆక్రమణకు పాల్పడటంతో అర్థరాత్రి కురిసిన వర్షంతో డ్రైనేజీ ఉప్పొంగి.. వరద పోటెత్తడంతో పక్కనే ఉన్న మిల్లు ఆవరణలోని గోదాంలో నిల్వ ఉంచిన పంచదార కరిగిపోయిన ఘటన హరియాణాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో రూ.50 నుంచి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. మిల్లు ఆవరణలోని గోదాంలో నిల్వ ఉంచిన చక్కెరలో 40 శాతం నష్టపోయినట్లేనన్నారు.
యమునా నగర్‌లోని సరస్వతి షుగర్ మిల్లులో సుమారు రూ.97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. ఆదివారం అర్థరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షంతో.. గోదాంలోకి వరద నీరు పోటెత్తిందని షుగర్ మిల్లు జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా చెప్పారు. ఇలా జరగడం ఇదే తొలిసారని, పూర్తిగా మిల్లు, గోదాం పరిశీలించిన తర్వాతే ఎంత నష్టం వాటిల్లిందన్న సంగతి తెలుస్తుందన్నారు.