Share News

BJP: బీజేపీకి మహిళా బాస్‌!

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:58 AM

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశముంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

BJP: బీజేపీకి  మహిళా బాస్‌!

  • రేసులో నిర్మల, పురందేశ్వరి, వనతీ శ్రీనివాసన్‌?

  • జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి

  • మహిళకు అప్పగించే యోచన

  • దక్షిణాదిలో విస్తరణకు వ్యూహం

  • ప్రతిపాదనకు ఆరెస్సెస్‌ మద్దతు

న్యూఢిల్లీ, జూలై 4: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశముంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలూ దక్షిణాదికి చెందినవారు కావడం విశేషం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి ఆరెస్సెస్‌ కూడా మద్దతు ఇస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరిలోనే ముగిసింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని 2024 జూన్‌ వరకు పొడిగించారు.


నిర్మలా సీతారామన్‌

అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతో్‌షతో ఆమె భేటీ అయ్యారు. సీతారామన్‌కు పగ్గాలు అప్పగించడం దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

వనతీ శ్రీనివాసన్‌

1993లో బీజేపీలో చేరిన వనతీ శ్రీనివాసన్‌ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2022లో పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి తమిళ మహిళ ఆమే.


పురందేశ్వరి

ఏపీ బీజేపీ మాజీ చీఫ్‌ పురందేశ్వరి బహుభాషావేత్త. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజమండ్రి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ కుమార్తెగానే గాక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై వివరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఆమె ఉన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 04:58 AM