Fire Accident: నిర్మాణంలో ఉన్న ఎన్‌టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం..రూ.400 కోట్ల లాస్
ABN , Publish Date - Apr 22 , 2025 | 10:49 AM
నిర్మాణంలో ఉన్న ఎన్‌టీపీసీ సోలార్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

గుజరాత్ దాహోద్‌లోని భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్లాంట్‌లోని 95% పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీంతో దాదాపు రూ. 400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదం జరిగిన తర్వాత రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
అగ్ని ప్రమాదం తీవ్రత
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఫలితంగా ప్లాంట్‌లో ఉన్న సోలార్ ప్యానెల్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ ఇతర పరికరాలు కాలిపోయాయి. NTPC సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దానిని నియంత్రించడం అసాధ్యంగా మారింది. దాహోద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి అగ్నిమాపక బృందాలను రప్పించారు. కానీ మంటలు చాలా తీవ్రంగా ఉండటం వలన వాటిని ఆర్పడం కష్టంగా మారింది. చివరకు 13 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కుట్ర, రాళ్ల దాడి ఘటనగా అనుమానం
అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయా వ్యక్తులు గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో కూడా అడ్డంకులను సృష్టించారు. సోమవారం పగటిపూట ప్లాంట్‌పై రాళ్లు రువ్వడంతో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాళ్లు రువ్విన వారి ఫోటోలు ప్లాంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. స్థానికుల నిరసనలు, రాళ్ల దాడి తరువాత, ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు, ఉన్నతాధికారుల చర్యలు
సమాచారం అందిన వెంటనే, డీఎస్పీ డాక్టర్. రాజ్‌దీప్ సింగ్ ఝాలా సహా సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, దాని వెనుక ఉన్న కుట్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. NTPC ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 18 వరకు పోలీసు రక్షణలో ప్లాంట్‌కు కంచె వేసే పనిని చేపట్టింది. అయితే, స్థానిక ప్రజల వ్యతిరేకత కారణంగా రెండు రోజుల క్రితం పనులు ఆగిపోయాయి. సోమవారం పనిని తిరిగి ప్రారంభించడానికి ఒక ఒప్పందం కుదిరింది. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చి పని ఆపకపోతే చర్య తీసుకుంటామని బెదిరించాడు. అతనితో పాటు 5-7 మంది వచ్చి రాళ్ళు విసరడం ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత వారే నిప్పంటించారా లేదా అనేది ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News