Share News

Fake Visa Racket Exposed: వీసా.. గోస!

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:10 AM

ఉన్న ఊరిలో ఉపాధి లేక.. ఉన్నా సంపాదన సరిపోక.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు ఎందరో. వారి ఆశలను సొమ్ము చేసుకుని, నకిలీ వీసాలతో వారి కలలను కల్లలు చేస్తున్న ముఠాలు పెరిగిపోయాయి.

Fake Visa Racket Exposed: వీసా.. గోస!

వ్యవస్థీకృతంగా మారిపోయిన వీసా మోసాలు

  • త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామంటూ అమాయకుల నుంచి లక్షల్లో వసూళ్లు

  • నకిలీ, ఫోర్జరీ పత్రాలతో విదేశాలకు..

  • అక్కడ పట్టుబడి కేసులు, జైళ్ల పాలవుతున్న బాధితులు

  • గత ఐదేళ్లలో 5 వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసిన ఓ ఢిల్లీ ముఠా

  • డబ్బులూ పోయి, విదేశాల్లో ఉద్యోగం ఆశలూ ఆవిరై కుంగిపోతున్న బాధితులు

న్యూఢిల్లీ, జూలై 17: ఉన్న ఊరిలో ఉపాధి లేక.. ఉన్నా సంపాదన సరిపోక.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు ఎందరో. వారి ఆశలను సొమ్ము చేసుకుని, నకిలీ వీసాలతో వారి కలలను కల్లలు చేస్తున్న ముఠాలు పెరిగిపోయాయి. లక్షలకు లక్షలు వసూలు చేసి తప్పుడు, ఫోర్జరీ పత్రాలు, నకిలీ వీసాలతో విదేశాలకు పంపుతున్నాయి. ఉద్యోగాలపై ఆశతో వెళ్లినవారు అసలు విషయం తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా వ్యవస్థీకృతంగా సాగుతున్నట్టు ఇటీవల బయటపడిన నకిలీ వీసా రాకెట్‌ బాగోతాల్లో వెలుగు చేసింది. మన దేశంలో హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, సూరత్‌, గాంధీనగర్‌, ఢిల్లీలలో పలు ముఠాలు అధికారులకు పట్టుబడ్డాయి. ఈ ముఠాలు రూ.23 లక్షల నుంచి రూ.67 లక్షల వరకు వసూలు చేసి.. నకిలీ వీసాలు, స్పాన్సర్‌ ఐడీ, ఇతర అనుమతి పత్రాలను ఫోర్జరీ చేసి వందలాది మందిని గల్ఫ్‌, యూరప్‌ దేశాలకు పంపినట్టు వెల్లడైంది.


పెరిగిపోతున్న వీసా మోసాలు

ఈ ఏడాది మొదట్లో నకిలీ షెంజెన్‌ వీసా (29 యూరప్‌ దేశాల ఉమ్మడి వీసా)తో దుబాయ్‌ వెళుతున్న ఏడుగురిని ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో ‘హైర్‌గ్లో ఎలిగాంట్‌ ఓవర్సీస్‌ ఇంటర్నేషనల్‌’ అనే సంస్థ 300 మందిని ఫోర్జరీ స్పాన్సర్‌షిప్‌ పత్రాలతో మోసం చేసిన విషయం బయటికి వచ్చింది. ఢిల్లీలోని ఓ ముఠా గత ఐదేళ్లలో 5 వేలకుపైగా నకిలీ వీసాలు, ఫోర్జరీ పత్రాలతో రూ.300 కోట్ల మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి తప్పుడు వీసాలతో వందలాది మందిని గల్ఫ్‌ దేశాలకు పంపిన సంగతి గతంలోనే బయటపడింది. కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు, కొందరు ఏజెంట్లపై అమెరికా విదేశాంగ శాఖ నిషేధం విధించిందంటే.. ఈ ముఠాలు అంతర్జాతీయంగా ఎంత వ్యవస్థీకృతంగా విస్తరించాయో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


రకరకాలుగా మభ్యపెట్టి..

సాధారణంగా ఉద్యోగ వీసాల కోసం చాలా తతంగం ఉంటుంది. విదేశాల్లోని సంస్థలు, వ్యక్తులు సదరు వ్యక్తికి తాము ఉద్యోగమిస్తామని స్పాన్సర్‌షిప్‌ పత్రాలు ఇవ్వాలి. ఆ తర్వాత వీసా కోసం దరఖాస్తు, విద్యార్హత, ఆరోగ్య ధ్రువీకరణ వంటి అవసరమైన పత్రాల సమర్పణ, సంబంధిత దేశ రాయబార కార్యాలయంలో ఇంటర్వ్యూ.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇందుకోసం సమయం పడుతుంది. అయితే నకిలీ వీసా ముఠాలు.. తాము త్వరగా స్పాన్సర్‌షిప్‌ పత్రాలు, వీసాలు ఇప్పిస్తామంటూ గాలం వేస్తున్నాయి. వీటిలో చాలా వరకు ఎలాంటి లైసెన్స్‌ లేనివే. విదేశాలకు ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాలనుకునేవారిని.. స్థానికంగా ఉండే మధ్యవర్తులు, ఏజెంట్ల సాయంతో గుర్తిస్తున్నాయి. ఫోర్జరీ స్పాన్సర్‌షిప్‌ పత్రాలతో పర్యాటక వీసాలపై విదేశాలకు పంపుతున్నాయి. అధికారులు కూడా క్షుణ్నంగా పరిశీలిస్తే తప్ప గుర్తించలేని స్థాయిలో ఈ నకిలీ పత్రాలు ఉంటుండటం గమనార్హం. కొన్నిసార్లు ఇక్కడే విమానం ఎక్కే ముందే నకిలీ, ఫోర్జరీ విషయం బయటపడుతోంది. ఇలాంటివారు లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టుకుని, పైగా ఉద్యోగం ఆశలు ఆవిరై ఆందోళనలో పడుతున్నారు.


విదేశాల్లో కష్టాలు పడుతూ..

నకిలీ వీసాలు, ఇతర పత్రాలతో వెళ్లినవారు విదేశాల్లో అధికారుల తనిఖీల్లో పట్టుబడి కష్టాల పాలవుతున్నారు. కేసులు, జైళ్ల పాలవుతున్నారు. కొన్నిసార్లు స్వదేశాలకు తిప్పిపంపేస్తున్నా.. మళ్లీ ఆ దేశంలోకి రాకుండా నిషేఽధం ఎదుర్కొంటున్నారు. ఇలా నకిలీ వీసాలు, పత్రాలతో విదేశాలకు పంపుతున్న ట్రావెల్‌ ఏజెన్సీలు, ఏజెంట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా... మోసాలు మరింతగా పెరిగిపోతూనే ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాంగ శాఖ నుంచి లైసెన్సు పొందిన సంస్థలు, ఏజెంట్ల ద్వారా వెళితే మోసపోకుండా ఉండవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా దేశాలకు చెందిన అధికారిక వెబ్‌సైట్లలో వీసా ప్రక్రియ, స్పాన్సర్‌షిప్‌ విధానం, ఇతర అంశాలను పరిశీలించాలని సూచించింది. మోసపోయినట్టు గుర్తిస్తే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 06:19 AM