EC Counters Rahul: మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు నిజం కాదన్న ఈసీ
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:39 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చివరి రెండు గంటల్లో అనైతిక ఓటింగ్ జరిగిందన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమని ఈసీ వర్గాలు తేల్చిచెప్పాయి. ఓటింగ్ గణాంకాల ప్రకారం చివరి రెండు గంటల్లో ఓటింగ్ శాతం తగ్గిందని స్పష్టం చేశాయి.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రెండు గంటల్లో అసాధారణ రీతిలో ఓటింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మంగళవారం ఈసీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. పోలింగ్ రోజున, ఆ మరుసటి రోజున కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ‘పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటలలోపు 6.40 కోట్ల మంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే సగటున గంటకు 58 లక్షల మంది ఓటు వేశారు. ఈ సరళి ప్రకారం చూస్తే చివరి రెండు గంటలల్లో సుమారుగా 1.16 కోట్ల మంది ఓటు వేసి ఉండాలి. అంటే రెండు గంటల్లో 65 లక్షల మంది ఓట్లు వేయడం అన్నది సగటు ఓటింగ్ సరళితో పోలిస్తే బాగా తక్కువ’ అని ఈసీ వర్గాలు వ్యాఖ్యానించాయి.