ED Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:48 AM
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, ఆయన తనయుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రూ.33 లక్షలు స్వాధీనం, భూపేశ్ తనయుడికి సమన్లు
రాయ్‌పూర్, మార్చి10: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, ఆయన తనయుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా దుర్గ్ జిల్లా భిలాయ్‌లోని చైతన్య బఘేల్ సన్నిహితులకు సంబంధించి మొత్తం 15 చోట్ల సోదాలు జరిగాయి. రూ.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సోదాలతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు ఈడీ అధికారులు చైతన్య బఘేల్‌కు సమన్లు జారీ చేశారు. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు. 2019-2022 మధ్య కాలంలో భూపేశ్ బఘేల్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన మద్యం కుంభకోణం వల్ల మద్యం సిండికేట్‌కు రూ.2100 కోట్ల లబ్ధి చేకూరిందని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే ఛత్తీ్‌సగఢ్ మాజీ మంత్రి కవాసి లఖ్మాతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.