Share News

EC: తమిళనాడులో ఎస్ఐఆర్ మొదలే కాలేదు, ఓటర్లు ఎలా పెరిగారు?.. చిదంబరం వ్యాఖ్యలపై ఈసీ

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:07 PM

తమిళనాడులో 6.5 లక్షల ఓటర్లు పెరిగారంటూ తప్పుడు సమాచారం ప్రచారంలోకి రావడం తమ దృష్టికి వచ్చిందని ఈసీఐ తెలిపింది. తమిళనాడులో అసలు ఎస్ఐఆర్ ప్రక్రియే మొదలు కాలేదని తెలిపింది.

EC: తమిళనాడులో ఎస్ఐఆర్ మొదలే కాలేదు, ఓటర్లు ఎలా పెరిగారు?.. చిదంబరం వ్యాఖ్యలపై ఈసీ
Election commission

న్యూఢిల్లీ: తమిళనాడులో 6.5లక్షల మంది ఓటర్లు పెరగారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) చేసిన వ్యాఖ్యలను భారత ఎన్నికల కమిషన్ (ECI) తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ స్థాయిలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చేపడుతున్న తరుణంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయరాదని రాజకీయ నేతలను కోరింది.


ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్‌లో ఎస్ఐఆర్ డ్రైవ్‌ను అడ్డుకునేందుకు మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఈసీఐ తెలిపింది. బిహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లకు సంబంధించి నిర్దిష్టమైన లెక్కలు ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాతే తెలుస్తాయని పేర్కొంది.


ఓటర్లు ఎక్కడైతే నివాస అర్హత కలిగి ఉంటారో ఆ నియోజకవర్గంలోనే ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఆర్‌పీ యాక్ట్ 1950 స్పష్టంగా చెబుతోందని ఈసీఐ పేర్కొంది. కానీ, తమిళనాడులో 6.5లక్షల ఓటర్లు పెరిగారంటూ తప్పుడు సమాచారం ప్రచారంలోకి రావడం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. తమిళనాడులో అసలు ఎస్ఐఆర్ ప్రక్రియే మొదలు కాలేదని తెలిపింది. బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియతో తమిళనాడుతో పోలిక తెచ్చి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది.


చిదంబరం ఏమన్నారు?

ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తిగా మారుతోందని, బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా, తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని, ఇది ఆందోళనకరమే కాకుండా చట్టవిరుద్ధమని చిదంబరం శనివారం నాడు పేర్కొన్నారు. ఓటర్లను శాశ్వత వలస కార్మికులుగా పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్టు అవుతుందని అన్నారు. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 09:51 PM