Supreme Court: రోహింగ్యాలకు రెడ్‌కార్పెట్ పరవాలా.. సుప్రీం సీరియస్
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:57 PM
భారతదేశంలో కూడా పేదప్రజలు ఉన్నారని, వారు ఈ దేశ పౌరులని, వారికి నిర్దిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్లపై ఎందుకు దృష్టి సారించరు? అని పిటిషనర్‌ను సీజేఐ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఐదుగురు రోహింగ్యాలు కస్టడీ నుంచి అదృశ్యమయ్యారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసదారులకు దేశం 'రెడ్ కార్పెట్' పరవాలని మీ ఉద్దేశమా అని పిటిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.
'మొదట మీరు సరిహద్దులను అక్రమంగా దాటారు. సొరంగం తవ్వో, కంచె దాటో దేశంలోకి అడుగుపెట్టారు. నేను ఇక్కడకు వచ్చినందున ఇక్కడి చట్టాలు అమలు చేయాలని అంటున్నారు. నాకు ఆహారం, ఆశ్రయం వంటివి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలకు చదువుకునే హక్కు ఉందంటున్నారు. ఆ విధంగా మన చట్టాలను సాగదీయాలనుకుంటున్నారా' అని పిటిషనర్‌ను సీజేఐ నిలదీశారు.
భారతదేశంలో కూడా పేదప్రజలు ఉన్నారని, వారు ఈ దేశ పౌరులని, వారికి నిర్దిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్లపై ఎందుకు దృష్టి సారించరు? అని పిటిషనర్‌ను సీజేఐ ప్రశ్నించారు. శరణార్ధికి చట్టబద్ధత లేనప్పుడు, ఎవరైనా చొరబాటుదారులు అక్రమంగా దేశంలో చొరబడితే వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకుందా? అని వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉందని, చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారిని రెడ్ కార్పెట్ స్వాగతం ఇస్తామా అని సీజేఐ వ్యాఖ్యానించారు.
కాగా, బాధిత పక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు మినహా పిటిషన్‌ను అనుమతించ రాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఈ తరహా పిటిషన్లతో సహా తాజా పిటిషన్‌పై విచారణను కోర్టు డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన
సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి