Tamil Nadu: డీలిమిటేషన్, నిర్బంధ హిందీ అమలుపై కేంద్రాన్ని నిలదీయాలి
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:27 AM
క్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), జాతీయ విద్యావిధానంపేరుతో రాష్ట్రంలో హిందీని నిర్బంధంగా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రంతో...

బాధిత రాష్ట్రాల ఎంపీలను కలుపుకొని వెళ్లాలి
డీఎంకే ఎంపీలకు స్టాలిన్ దిశానిర్దేశం
చెన్నై, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), జాతీయ విద్యావిధానంపేరుతో రాష్ట్రంలో హిందీని నిర్బంధంగా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రంతో అమీతుమీకి డీఎంకే సిద్ధమవుతోంది. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాలకపక్షాన్ని నిలదీయాలని ఆ పార్టీ ఎంపీలు నిర్ణయించారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అరివాలయంలో ఆదివారం ఉదయం డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించారు. నియోజవర్గాల పునర్విభజన వల్ల నష్టపోయేదీ తమిళనాడు మాత్రమే కాదని.., ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిస్సా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాల సంఖ్య బాగా తగ్గే అవకాశాలున్నాయని, ఈ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సమావేశంలో స్టాలిన్ సూచించారు. డీఎంకే అన్యభాషలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని పార్లమెంటు ఉభయసభల్లో కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించాలని పేర్కొన్నారు. ఏ భాషను నిర్బంధంగా అమలు చేయకూడదని డీఎంకే దశాబ్దాల తరబడి చెబుతున్న విషయాన్ని అన్ని పార్టీల ఎంపీలకు సులువుగా అర్థమయ్యే పదజాలంతో డీఎంకే ఎంపీలు వివరించాలన్నారు.
త్రిభాషా విద్యావిధానం గురించి సభ్యులు ఆచితూచి మాట్లాడాలని, తమ వాదనలను సమర్థవంతంగా వినిపించాలన్నారు. రాష్ట్రంలో నిర్బంధ హిందీని అమలు చేయడానికిగాను....జాతీయ విద్యావిధానాన్ని ఆమోదించకుంటే నిధులు రావని కేంద్రం బెదిరిస్తున్న విషయాన్ని కూడా సభలో ప్రస్తావించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు దిశగా స్టాలిన్ చేపడుతున్న చర్యలను సమర్ధిస్తూ ఎంపీలు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించారు. నిర్బంధ హిందీని అమలు చేసి తమిళభాషకు ముప్పు కలిగించడానికి కేంద్రం చేస్తున్న కుట్రను అడ్డుకునేలా, నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించేలా ఉభయ సభల్లో పటిష్టమైన వాదనలను వినిపిస్తామని ఈ విషయంలో పార్టీ ఎంపీలందరూ ఏకతాటిపై నడుస్తామని మరొక తీర్మానం కూడా చేశారు.