DGP: ఏఐ టెక్నాలజీతో కరడుగట్టిన నేరస్థుల అరెస్టు
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:25 AM
కోయంబత్తూరు బాంబు పేలుళ్ళతో పాటు పలు నేరాలతో సంబంధం ఉన్న ముగ్గురు కరడుగట్టిన నేరస్థులను వారి పాత ఫొటోలను ఉపయోగించి కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో గుర్తించి అరెస్టు చేసినట్టు డీజీపీ శంకర్ జివాల్ వెల్లడించారు. ఆయన శనివారం మైలాపూర్‌లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

చెన్నై: కోయంబత్తూరు బాంబు పేలుళ్ళతో పాటు పలు నేరాలతో సంబంధం ఉన్న ముగ్గురు కరడుగట్టిన నేరస్థులను వారి పాత ఫొటోలను ఉపయోగించి కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో గుర్తించి అరెస్టు చేసినట్టు డీజీపీ శంకర్ జివాల్(DGP Shankar Jival) వెల్లడించారు. ఆయన శనివారం మైలాపూర్‌లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు 2023లో రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేశారని, ఆ ప్రకారంగా రాష్ట్రం నుంచి 29 కేసులను ఆ విభాగానికి బదిలీ చేసినట్టు చెప్పారు.
మరో 40 కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. పాత కేసులను విచారిస్తుండగా, కొన్నేళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇందుకోసం ఆపరేషన్-2ను ప్రారంభించామన్నారు. ఇందులో ఒక ఆపరేషన్‌కు ‘అరమ్’, మరో ఆపరేషన్‌కు ‘అగళి’ అనే పేర్లు పెట్టినట్టు వెల్లడించారు. కోవై నగర పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగం కలిసి ఈ ఆపరేషన్లు చేపట్టాయన్నారు. కొన్ని కేసుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేంద్ర హోం శాఖ సహాయం తీసుకుని కొందరు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
ఒక నిందితుడిని 30 యేళ్ళ తర్వాత, మరో నిందితుడిని 26 యేళ్ళ తర్వాత అరెస్టు చేశామన్నారు. వారు అబుబాకర్ సిద్ధిఖ్, అదిల్ అబుబాకర్ సిద్ధిఖ్ అని వివరించారు. మొదటి నిందితుడిపై తమిళనాడులో 5, కేరళలో రెండు కేసులున్నాయన్నారు. రెండో నిందితుడిపై 1999లో జరిగిన బాంబులు అమర్చినందుకు ఏకంగా 7 కేసులున్నాయన్నారు. ఈ ఇద్దరిని ఏపీలోని అన్నమయ్య జిల్లాలో అరెస్టు చేసినట్టు వివరించారు.
మూడో నిందితుడు టైలర్ రాజాను కర్ణాటక పోలీసుల సాయంతో ఆ రాష్ట్రంలోనే అరెస్టు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర పోలీసులు ఎంతో ప్రతిభావంతంగా పనిచేసి, ముగ్గురు భయంకరమైన తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరి కోసం పాత ఫోటోలకు ఐఏ టెక్నాలజీ ఉపయోగించినట్టు డీజీపీ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News