New Delhi: ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:13 PM
దేశంలో మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణలో తీగ లాగగా సంబంధమున్న వ్యక్తుల డొంక కదులుతోంది.
న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సమీపంలో ఉగ్రవాదులకు(Terrorists) సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్(Faridabad)లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు(350 Kg of Explosives), ఒక రైఫిల్ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా(Police Commissioner Satender Kumar Gupta) వెల్లడించారు. వీటితో పాటు మూడు మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్‌ను స్వాధీనపరచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఉగ్రసంస్థ పోస్టర్లు అంటించడంతో వెలుగులోకి..
శ్రీనగర్‌లో(Srinagar) అక్టోబర్ 27న జైష్-ఎ-మహమ్మద్(Jaish E Mohammad) ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. వీటిని కశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్(Adil Ahmed Rather) వేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పసిగట్టారు. సదరు వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పుర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతణ్ని గతవారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గతేడాది అక్టోబర్ ముందువరకూ అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తించాడని, అక్కడ అతని లాకర్‌ను తనిఖీ చేయగా ఒక రైఫిల్ దొరికిందని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారమే ఫరిదాబాద్‌లో ఈ రికవరీ జరిగినట్టు వెల్లడించారు.
నిందితుడు రాథర్ చెప్పిన ప్రకారం.. ముజామ్మిల్ షకీల్(Muzammil Shakil) అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తేలింది. దీంతో పుల్వామాకు చెందిన షీకల్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ ఆస్పత్రి(Al-Falaj Hospital)లో పనిచేస్తున్నాడు.
లేడీ డాక్టర్ కారులో..
ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళా వైద్యురాలి(Lady Doctor) కారులో ఒక రైఫిల్, పిస్టల్ బయటపడ్డాయి. ఆమె మందుగుండు సామాగ్రిని నిల్వచేసేందుకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు.. ఆమెపై విచారణ చేపట్టారు.
Also Read:
ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..