Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:20 PM
ఢిల్లీ పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుల్లో ఒకరైన వైద్యురాలు షాహీన్ పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షాహీన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటే నమ్మశక్యంగా లేదని వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయమై దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టగా.. వారు బాధాతప్త హృదయంతో ఎంతో అమాయకంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుళ్ల ఘటనకు కారణమైన కీలక నిందితుల్లో ఒకరైన డాక్టర్ షాహీన్ పట్ల ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడిన తీరు విస్మయం వ్యక్తం చేస్తోంది. షాహీన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని.. కనీసం అలాంటి సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం తాము లక్నోలోని దాలిగంజ్ ప్రాంతంలోని ఓ ఇరుకైన సందులో నివాసముంటున్నామని, తాముండే ప్రాంతానికి ఢిల్లీకి సుమారు 550 కిలోమీటర్ల దూరం ఉంటుందని షాహీన్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ అన్నారు.
నమ్మశక్యంగా లేదు: తండ్రి
'ఢిల్లీలో జరిగిన పేలుడు కేసులో షాహీన్‌కు సంబంధముందని, జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తోందనే ఆరోపణలపై ఆమె అరెస్ట్ కావడం కలిచివేస్తోంది. ఆమె ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తుందని విని షాక్ తిన్నా. ఇటీవలే అనగా దాదాపు నెల క్రితం నేను ఆమెతో మాట్లాడాను. ఆమె అలహాబాద్‌లో వైద్య విద్య పూర్తి చేసి, ఫరీదాబాద్‌లో పనిచేస్తోంది.' అని అన్సారీ తెలిపారు.
నాలుగేళ్లుగా టచ్‌లో లేదు: సోదరుడు
షాహీన్ సోదరుడు మహమ్మద్ షోయబ్ మాట్లాడుతూ.. 'షాహీన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటే నమ్మలేకపోతున్నాం. ఆమె ఢిల్లీలో అరెస్టయ్యాక.. ఇటీవల పోలీసులు, భద్రతా దళ సిబ్బంది మా ఇంటికి వచ్చారు. వారు నాతో సహా మా కుటుంబంలో ఎవ్వరినీ ఇబ్బందులకు గురిచేయలేదు. గత నాలుగేళ్లుగా షాహీన్ మాకు దూరంగా ఉంటోంది. కానీ ఆమె పిల్లలతో మా అమ్మానాన్నలు అప్పుడప్పుడూ మాట్లాడుతుండేవారు. లఖ్‌నవూలోని ఐఐఎం రోడ్డులో షాహీన్‌కు ఓ ఇల్లుందని తెలుసు. మేమెప్పుడూ అక్కడికి వెళ్లలేదు. కనీసం అదెక్కడుందో, ఎలా ఉందో కూడా మాకు తెలీదు. మెడిసిన్ చదివేటప్పుడు ఆమె ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్టు కూడా అనిపించలేదు. అలాంటిది ఆమెకు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నాం.' అని వివరించారు.
Dr Shaheen's document of Chharapati Shahu Ji University
బురఖా కూడా ధరించేది కాదు: మాజీ భర్త
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత కాన్పూర్‌లో ఆప్తమాలజిస్ట్‌గా పనిచేస్తున్న షాహీన్ మాజీ భర్త డా.జాఫర్ హయత్‌ను పోలీసులు విచారించారు. 'షాహీన్ అరెస్టైన విషయం నాకూ మంగళవారమే తెలిసింది. మేమిద్దరం విడి విడిగా మెడిసిన్ పూర్తిచేశాం. నేను ఆమెకు సీనియర్‌ని. 2003లో మాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. 2012లో మేం విడాకులు తీస్కున్నాం. అయితే మా మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు. విడాకుల తర్వాత ఆమెతో నేనెప్పుడూ మాట్లాడలేదు. అసలు ఆమె పెళ్లిళ్లలో తప్ప ఎప్పుడూ కనీసం బురఖా కూడా ధరించేది కాదు. అలాంటిది ఆమెకు ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందంటే నమ్మలేకపోతున్నాను.' అని హయత్ చెప్పారు. షాహీన్.. అప్పట్లో విదేశాల్లో స్థిరపడాలని తరచూ అంటుండేదని ఆయన తెలిపారు. అయితే.. ఆమె భారత్‌లోనే ఉన్నట్టు ఇటీవలే తెలిసిందన్నారు.
Dr Shaheen with some of her friends
వైద్యురాలైన షాహీన్ గురించి విచారణ చేపట్టిన దర్యాప్తు బృందం పలు విషయాలు వెల్లడించింది. 2013లో జీవీఎస్ఎమ్ మెడికల్ కాలేజీ నుంచి ఆమె ఎలాంటి సమాచారం లేకుండా అదృశ్యమైందని, ఫలితంగా కాలేజీ యాజమాన్యం ఆమెను తొలగించినట్టు తెలిపింది. ఆల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో చేరాక.. ఆమెకు డా.ముజామ్మిల్ గనైతో పాటు ప్రస్తుతం అరెస్టైన మరో ఇద్దరు వైద్యులతో పరిచయం ఏర్పడిందని అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇవీ చదవండి: