Red Fort Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. పోలీసులకు చిక్కిన మూడో కారు..
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:33 PM
ఉగ్రవాదులు నాలుగు కార్లతో బాంబు దాడులు చేయాలని కుట్ర చేశారు. ఉమర్ ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మిగిలిన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మాహుతి బాంబు దాడిలో 11 మంది అమాయక పౌరులు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు తేల్చారు. కారులో దొరికిన కాలు నుంచి సేకరించిన డీఎన్ఏ.. ఉమర్ తల్లి డీఎన్ఏతో మ్యాచ్ అయింది. ఇక, ఇదే కేసుకు సంబంధించి ఉమర్ బంధువు ఫహీమ్‌ను ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాండ్వాలిలో కారు పార్క్ చేసింది ఫహీమేనని గుర్తించారు.
మూడో కారు స్వాధీనం
ఉగ్రవాదులు మొత్తం నాలుగు కార్లతో పేలుళ్లకు కుట్ర చేశారు. ఉమర్ ఐ20 కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. తాజాగా, మూడో కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐ20, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లు ఉమర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ముజంమిల్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. మారుతీ బ్రీజా కారు డాక్టర్ షహీనా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దర్యాప్తు సంస్థలకు అల్ఫల కాలేజీలో కీలక ఆధారాలు దొరికాయి. ఉగ్రవాదులు కాలేజీలోని ల్యాబ్ నుంచి పలు కెమికల్స్ సేకరించినట్లు తెలుస్తోంది.
దాదాపు 20 లక్షల రూపాయల డబ్బుల్ని కూడా సేకరించి ఉమర్‌కు ఇచ్చారు. గ్రూప్ సభ్యులంతా సిగ్నల్ యాప్‌లో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అధికారులు ఒక్కొక్కరిగా కేసుతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆరుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరిలో ఫరీదాబాద్‌కు చెందిన కారు డీలర్ కూడా ఉన్నాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఐ20 వైట్ కారును అమ్మింది అతడే. బాంబు దాడి జరగడానికి 13 రోజుల ముందే అతడు నిందితుడికి కారు అమ్మాడు.
ఇవి కూడా చదవండి
బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూత
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా