President Murmu: పాపం ముర్ము.. పూర్ లేడీ!
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:37 AM
శుక్రవారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. రాష్ట్రప్రతి ప్రసంగంపై ఆమె తన కుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రా హుల్‌గాంధీ, కుమార్తె, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తో కలిసి మీడియా ఎదుట స్పందించారు.

రాష్ట్రపతిపై సోనియా వ్యాఖ్యలు.. బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ దుమారం!
రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్ అన్న రాహుల్
ప్రధాని, బీజేపీ నేతల ఆగ్రహం
న్యూఢిల్లీ, జనవరి 31: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజే రాజకీయ దుమారం చోటుచేసుకుంది. శుక్రవారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. రాష్ట్రప్రతి ప్రసంగంపై ఆమె తన కుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రా హుల్‌గాంధీ, కుమార్తె, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తో కలిసి మీడియా ఎదుట స్పందించారు. ప్రసంగం సుదీర్ఘంగా ఉందన్నారు. ‘పూర్ లేడీ(రాష్ట్రపతి ముర్ము).. బాగా అలసిపోయారు.. పాపం.. ప్రసంగం చదవలేకపోయారు’ అని జాలిగొల్పేలా మాట్లాడారు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అయింది. ‘ప్రసంగం బోరింగ్‌గా ఉందా? నో కామెంట్స్! చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పారు’ అని రాహుల్ తన తల్లితో అనడం అందులో వినిపించింది. వీరి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేతలు విరుచుకుపడ్డారు. ఇవి ముర్ము పరువుకు భంగం కలిగించేవిగా, అవమానకరంగా ఉన్నాయని.. కాంగ్రెస్ అగ్ర నేతల భూస్వామ్య, పెత్తందారీ పోకడకు ఇవి నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిపై తనకున్న చులకన భావాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై రాష్ట్రపతిభవన్ కూడా స్పందించింది. సోనియా, రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది.
దురహంకారం బట్టబయలు: ప్రధాని
ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో తాజా అంశంపై స్పందించారు. సోనియాను తీవ్రంగా విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు పేదలు, గిరిజనులను అవమానించేవిగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రథమ కుటుంబం దురంహంకారం ఇవాళ పూర్తిగా బట్టబయలైందని, దేశానికి తామే యజమానులమని ఈ కాంగ్రెస్ నేతలు భావిస్తుంటారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి తన మాతృభాష ఒడియాలాగా హిందీలో మాట్లాడలేకపోయినా.. పార్లమెంటులో స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ నేతలు ఆ ప్రసంగంపై వ్యాఖ్యలు చేసి ఆమెను చిన్నబుచ్చారు. ఆ పార్టీ రాచకుటుంబం మరింత లోతుకు దిగజారింది. ఇది దేశంలోని 10 కోట్ల మంది గిరిజన సోదర సోదరీమణులకు అవమానం. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి పేదవాడికీ అవమానం’ అని వ్యాఖ్యానించారు. భారత ఆర్థికాభివృద్ధి, రైతు సంక్షేమం, మెట్రో ప్రాజెక్టులు, క్రీడాకారుల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారని.. కాంగ్రెస్ రాచకుటుంబానికి అది కూడా విసుగుపుట్టించిందని.. అర్బన్ నక్సల్స్ మాటలైతే వారికి బాగా ఆసక్తికరంగా ఉంటాయని విమర్శించారు. కాంగ్రె్‌సకు ఎప్పుడూ అణగారిన వర్గాల అభ్యున్నతి పట్టదని ఆయన చెప్పారు.
ఆ వ్యాఖ్యలు సముచితం కాదు రాష్ట్రపతి భవన్
సోనియా, రాహుల్ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ కూడా స్పందించింది. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ నేతల మాటలు సముచితం కాదని.. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశారని, ఇవి ఆమోదయోగ్యం కావని ఓ ప్రకటనలో పేర్కొంది. హిందీవంటి భారతీయ భాషల యాసల గురించి తెలియనట్లు కనిపిస్తోందని, అందుకే తప్పుడు అభిప్రాయం ఏర్పడినట్లు భావిస్తున్నామని తెలిపింది. ‘ఏది ఏమైనా అలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం.. పూర్తిగా నివారించాల్సినవి. ప్రసంగం ముగిసేటప్పటికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని.. మాట్లాడలేకపోయారని సదరు కాంగ్రెస్ నేతలు అన్నారు. వీటిలో ఏ మాత్రం నిజం లేదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేయదలచింది. ప్రసంగించేటప్పుడు ఏ దశలోనూ రాష్ట్రపతి అలసిపోలేదు. పైగా అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడడం అలుపు కలిగించదని రాష్ట్రపతి విశ్వసిస్తున్నారు‘ అని పేర్కొంది.
అమ్మకు దురుద్దేశం లేదు: ప్రియాంక
తన తల్లికి రాష్ట్రపతి పట్ల అగౌరవం లేదని, ఆమె వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని ప్రియాంక అన్నారు. మోదీ, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతి భవన్ కూడా తీవ్రంగా స్పందించడంతో ఆమె మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నా తల్లి 78 ఏళ్ల వృద్ధురాలు. రాష్ట్రపతి ఇంత సుదీర్ఘ ప్రసంగం చదివి అలిసిపోయినట్లు కనిపించారంటూ జాలిపడ్డారు. రాష్ట్రపతి అంటే ఆమెకు అత్యున్నత గౌరవముంది. ఈ అంశాన్ని మీడియా వక్రీకరించడం దురదృష్టకరం’ అని అన్నారు. కాగా, సోనియా లక్ష్యంగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఆర్థిక సర్వే మోదీ ప్రభుత్వానికి సత్యాన్ని చూపించిందని.. అయితే దేశ ఆర్థిక దుస్థితిని కప్పిపుచ్చడానికి బీజేపీ నాయకులు, ఓ వర్గం మీడియా.. సోనియా వాడిన పదాలను వక్రీకరిస్తున్నారని ‘ఎక్స్’లో ఆరోపించారు.
భూస్వామ్య మనస్తత్వం: నడ్డా
సోనియా వ్యాఖ్యలు చాలా అగౌరవంగా ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిపై కాంగ్రె్‌సకున్న అగౌరవాన్ని ఇది చాటిందన్నారు. ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. దేశం కోసం, సమాజం కోసం విస్తృతంగా ద్రౌపది ముర్ము కృషిచేశారని.. గిరిజన మహిళ అయిన మన రాష్ట్రపతి బలహీనురాలు కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు స్పష్టంచేశారు. ఆమెను బలహీనురాలిగా చూపేందుకు చేసే ప్రయత్నాలను బీజేపీ సహించదన్నారు. కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా, రాహుల్ వ్యా ఖ్యలు రాష్ట్రపతికి తీరని అవమానమని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ ధ్వజమెత్తారు. ముర్ము ఆదివాసీ కుటుంబానికి చెందినవారని, విమర్శించడ సరికాదన్నారు.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News