Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..
ABN , Publish Date - Nov 16 , 2025 | 03:04 PM
తేజస్వి యాదవ్‌కు కీలక సన్నిహితుడైన రమీజ్ నేమత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భంగ్‌కలా గ్రామానికి చెందినవాడు. రాజకీయ సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చాడు.
పాట్నా: బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ (RJD) ఘోరంగా దెబ్బతినడం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) రాజకీయాలకు గుడ్‌బై చెప్పడంతో పాటు కుటుంబాన్ని వదులుకుంటున్నట్టు కూడా ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. పార్టీ దయనీయ ఫలితాలపై ప్రశ్నించినందుకు తన సోదరుడు తేజస్వి యదవ్, ఆయన సన్నిహితులైన ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ (Sanjay Yadav), రమీజ్ నేమత్ (Rameez Nemat) తనపై దాడి చేసి కొట్టారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎవరీ రమీజ్ నేమత్
తేజస్వి యాదవ్‌కు కీలక సన్నిహితుడైన రమీజ్ నేమత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భంగ్‌కలా గ్రామానికి చెందినవాడు. రాజకీయ సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తండ్రి ఎన్‌యూ ఖాన్ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ప్రొఫెసర్. బల్రామ్‌పూర్ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీన్ అల్లుడు. క్రికెట్ ఆడుకునే రోజుల నుంచి తేజస్వికి రమీజ్ సన్నిహితుడు. కీలకమైన పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రచార నిర్వహణ బాధ్యతలతో పాటు ఆర్జేడీ సోషల్ మీడియా మానిటరింగ్ బాధ్యతలు చూస్తున్నాడు. తేజస్వి ఆంతరంగికుల్లో సంజయ్ యాదవ్‌తో పాటు రమీజ్ కూడా ఉన్నాడు.
వివాదాల్లోనూ..
రమీజ్ నేమత్‌పై పలు క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. 2021లో తులసీపూర్ నగర్ పంచాయత్ చైర్మన్ ఫిరోజ్ అహ్మద్ పప్పు హత్య కేసు, 2023లో కౌషాంబిలో కాంట్రాక్టర్ మహమ్మద్ షకీల్ అహ్మద్ హత్య కేసులో అతను నిందితుడు. ఆయన, ఆయన సహచరులు పలు కేసుల్లో బెయిలుపై ఉన్నారు. 2023లో అతనికి సంబంధించిన రూ.4.75 కోట్ల ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్థానిక బాధితుల బంధువులు సైతం రమీజ్‌కు ఆశ్రయం ఇవ్వడంపై తేజస్విని విమర్శించిన సందర్భాలున్నాయి. రాజకీయ పరపతితో రక్షణ పొందుతున్న నేరస్థుడిగా రమీజ్‌ను వీరు చెబుతుంటారు.
కాగా, పార్టీలోనూ, కుటుంబంలోనూ తీవ్ర సంక్షోభం నెలకొన్న తరుణంలో రోహిణి ఆచార్య తన కుటుంబం నుంచి తాజాగా బయటకు వచ్చేశారు. దీనికి ముందు ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కూడా పార్టీ నుంచి, కుటుంబం నుంచి ఆర్జేడీ బహిష్కరించింది. ఆర్జేడీ అంతర్గత, కుటుంబ కలహాల ప్రభావం, పనితీరు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 సీట్లలో గెలుపునకే పరిమితమైంది. ఎన్డీయే రికార్డు స్థాయి గెలుపు సాధించింది.
రోహిణి భావోద్వేగ సందేశం
రాజకీయాల నుంచి, కుటుంబం నుంచి తప్పుకుంటున్నానంటూ రోహిణి ఆచార్య వరుస పోస్టుల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'వాళ్లు నా కుటుంబాన్ని, హక్కులను, గౌరవాన్ని ఊడలాక్కున్నారు. నన్ను అనాథను చేశారు. ఏ ఇంట్లోనూ రోహిణిలాంటి కూతురు కానీ, సోదరి కానీ ఉండకూడదు' అని ఆవేదన వ్యక్తం చేసారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు తన కిడ్నీని రోహిణి ఆచార్య ఇటీవల ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.