Share News

Mohan Bhagwat: మోహన్‌ భాగవత్‌.. దేశంలో తిరగలేరు జాగ్రత్త!

ABN , Publish Date - Jan 16 , 2025 | 06:01 AM

ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. మన దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందని భాగవత్‌ పేర్కొన్నారు.

Mohan Bhagwat: మోహన్‌ భాగవత్‌.. దేశంలో తిరగలేరు జాగ్రత్త!

  • ‘నిజమైన స్వాతంత్య్రం’ వ్యాఖ్యలపై సంఘ్‌ చీఫ్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక

  • 1947లో స్వాతంత్య్రం వచ్చిందనేది మీరు గుర్తించకపోవడం సిగ్గుచేటు

  • అంబేడ్కర్‌ అన్నట్టుగా చరిత్రను విస్మరించేవాళ్లు చరిత్ర సృష్టించలేరు

  • ఎందరో ప్రాణాలర్పించారు.. అందుకే మేం 1947ను గుర్తుపెట్టుకుంటాం: ఖర్గే

  • కాంగ్రెస్‌ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం.. ఇందిరాభవన్‌గా పేరు

న్యూఢిల్లీ, జనవరి 15: ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. మన దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందని భాగవత్‌ పేర్కొన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో భాగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే భాగవత్‌ ‘అసలైన స్వాతంత్య్రం’ వ్యాఖ్యలను ఖర్గే తీవ్రంగా ఖండించారు. భాగవత్‌ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే గనక ఆయనకు దేశంలో తిరగడం కష్టమవుతుందని హెచ్చరించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దాన్ని గుర్తించకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘చరిత్రను మరిచిపోయేవాళ్లు చరిత్ర సృష్టించలేరు’ అన్న అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఖర్గే ప్రత్యేకంగా గుర్తుచేశారు. బుధవారం ఢిల్లీలోని 9-ఏ కోట్లా రోడ్డులో కాంగ్రెస్‌ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఖర్గే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎ్‌సఎస్‌ వాళ్ల పాత్రేలేదని, ఎవ్వరూ జైళ్లకు వెళ్లలేదని, అసలు స్వాతంత్య్ర పోరాటంతో వారికి సంబంధమే లేదని.. ఈ విషయాలు అందరికీ తెలుసునని.. అందుకే మన దేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించిందనే విషయం వారికి గుర్తులేక.. ఇప్పుడు రామ మందిరం ప్రారంభమైన రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘రామ మందిరం ప్రారంభోత్సవం రోజు స్వాతంత్య్రం వచ్చిందని భాగవత్‌ చెబుతున్నారు. ప్రధాని మోదీనేమో తాను అధికారంలోకి వచ్చిన 2014లోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని నమ్ముతారు. కానీ దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోరాటం చేశారు. తమ ప్రాణాలను అర్పించారు కాబట్టి మేం మాత్రం 1947 స్వాతంత్య్రం వచ్చిందని గుర్తుపెట్టుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిందని, దీన్ని మరిచిపోయినవాళ్లు చరిత్ర సృష్టించలేరని సంఘ్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. కాగా, పార్టీ నూతన కేంద్ర కార్యాలయానికి ‘ఇందిరా భవన్‌’ అని పేరు పెట్టారు.


‘ఎల్‌ అండ్‌ టీ-90 గంటల పని’పై అసంతృప్తి

వారంలో 90 పని గంటలు ఉండాలంటూ ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణియన్‌ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే విభేదించారు. రోజుకు 8గంటలు పనిచేశాక అలసిపోతారు కాబట్టే రోజుకు అంతకుమించి పని గంటలు ఉండొద్దంటూ నెహ్రూ, అంబేడ్కర్‌ సూచించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఎల్‌ అండ్‌ టీ వాళ్లు 12 గంటలు, 14 గంటలు అంటున్నారని పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ ఆఫీసు వాస్తు మార్చిన సంఘ్‌

కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఆఫీసు వాస్తును సంఘ్‌ ప్రభావితం చేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. పార్టీ కార్యాలయ ప్రధాన ముఖ ద్వారం వాస్తవానికి దీన్‌దయాళ్‌ మార్గ్‌ వైపు ఉండాల్సింది. ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త పేరుతో కార్యాలయ చిరునామా ఉండేందుకు వీల్లేకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తపడింది. ఆ మేరకు దీన్‌దయాళ్‌ రోడ్డుకు వెనుకవైపు రోడ్డు అయిన కోట్లా మార్గ్‌వైపు కార్యాలయ ప్రధాన ద్వారాన్ని తెరిచింది.


ఏఐసీసీ కార్యాలయంలో పీవీకి చోటు

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు గుర్తింపునిచ్చింది. బుధవారం ప్రారంభమైన ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో పీవీ చిత్రపటాలను మూడింటిని ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి.. పీవీ కుర్చీలో కూర్చున్న ఫొటో ఒకటి కాగా, మరొకటి ప్రధాని హోదాలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్‌ యంగ్‌ సామ్‌ను స్వాగతిస్తున్న ఫొటో. మూడోది.. కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఒకప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో కలిసి ఉన్న ఫొటో. పీవీ నర్సింహారావు 1991-1996 మధ్య దేశ ప్రధానిగా పనిచేయడంతోపాటు 1992-1994 మధ్య ఏఐసీసీ అధ్యక్షుడిగానూ వ్యవహరించినప్పటికీ ఇప్పటివరకు ఉన్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయలేదు. ఆయన మృతి చెందిన 20 ఏళ్ల తరువాత తాజాగా ఏఐసీసీ కార్యాలయంలో ఆయనకు చోటు దక్కింది.

Updated Date - Jan 16 , 2025 | 06:01 AM